
కొండా సురేఖను సన్మానిస్తున్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి
అనంతగిరి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశధోరణి అవలంబిస్తోందని మాజీమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ మండిపడ్డారు. శుక్రవారం వికారాబాద్‌లోని మాజీమంత్రి ప్రసాద్‌కుమార్ నివాసంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని అన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడా విద్వేశపూరిత ప్రసంగాలు చేయలేదన్నారు. తమ నాయకుడిని చూస్తే బీజేపీ నాయకత్వానికి భయం వేస్తున్నట్లు ఉందన్నారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన మా నేతకు నేడు యావత్ దేశమంతా అండగా నిలుస్తోందన్నారు. ప్రజల పక్షాన ఉంటూ వారి బాగుకోసం ఎంతటికై నా పోరాడుతామన్నారు. ఆర్థిక నేరగాళ్లను పెంచి పోషిస్తోందని విమర్శించారు. భారత్‌జోడో యాత్రతో రాహుల్‌గాంధీకి ఎనలేని ప్రజాధరణ లభించిందన్నారు. ప్రజాధరణను చూసి ఓర్వలేక బీజేపీ కుయుక్తులు పన్నుతోందనాన్నరు. ఎన్ని కేసులు పెట్టినా జైళ్లకు పంపినా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు మేమంతా కష్టపడి పనిచేస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్‌తో రాష్ట్ర ప్రభుత్వం వేలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. అనంతరం పట్టణ పార్టీ అద్యక్షుడు సుధాకర్‌రెడ్డి ఆమెను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సంతోష, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాజీమంత్రి కొండా సురేఖ