
విద్యుత్ దీపాలంకరణలో భవానీ మాత ఆలయం
బషీరాబాద్: మండలంలోని దామర్‌చెడ్‌లో వెలిసిన అంబాభవానీ మాత జాతర ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో కొనసాగే ఉత్సవాల కోసం ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లాతోపాటు సుమారు 8 రాష్ట్రాల నుంచి భవానీమాత భక్తులు, ఆధ్యాత్మిక గురువులు తరలివస్తారని ఆలయ పీఠాధిపతి శ్రీశంకర్ స్వామిజీ తెలిపారు. స్వర్గీయ మాణిక్యప్ప పూజారి మాహా సంస్థానంలో అంబాభవానీ మాత దేవస్థానం ప్రసిద్ధి చెందింది. ఆలయ పరిసరాల్లో భవానీ మాతతో పాటు శంకరుడు, స్వయంభు శ్రీకష్ణుడు, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, వినాయకుడు, ఆంజనేయ స్వామి, ఉగ్ర నర్సింహస్వామి, మహాలక్ష్మి, మహిశాసుర మర్దిని, నవగ్రహలు ప్రతిష్ఠించారు. ఈ దేవాలయాల సమూహానికి భవానీ నగర్‌గా నామకరణం చేశారు. అమ్మవారికి, దేవతామూర్తులకు నిత్యం పూజలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి పల్లకీ సేవ, అమావాస్యకు దీపారాధన నిర్వహిస్తారు. ఏటా కార్తీక మాసంలో లక్షదీపోత్సవం కనుల పండువగా నిర్వహిస్తారు. ప్రతిఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున భవానీ అమ్మవారి జాతర నిర్వహించడం 1974 నుంచి ప్రారంభమైంది. ఉత్సవాలకు ఆంధ్రపదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్, తమిళనాడు, గుజరాత్ నుంచి భక్తులు, ఆధ్యాత్మిక గురువులు వస్తుంటారు. తాండూరు నుంచి ఆర్టీసీ బస్సు సౌకార్యం ఉంది.
కార్యక్రమాలు ఇవీ..
ఒకటి నుంచి ఈ నెల 5 వరకు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరుగుతాయి. మొదటి రోజు దేవీ భాగవత పురాణం మాడపతి సిద్ధిలింగయ్య స్వామి చేత ప్రవచనం నిర్వహిస్తారు. అలాగే 108 మంది దంపతులతో అమ్మవారికి మహాభిషేకం చేస్తారు. ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు లమ్మవారికి కుంకుమార్చన చేస్తారు. సోమవారం మహాశివుడికి లక్ష బిల్వార్చన జరుగుతుంది. మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. బుధవారం ఉదయం 9 గంటలకు మృత్యుంజయ హోమం, గాయత్రి హోమం, ఉదయం 11 గంటటలకు లక్ష్మీనర్సింహ, పార్వతీపరమేశ్వర కల్యాణం జరుగుతుంది. సామంత్రం 5 గంటలకు అమ్మవారి పాదాల వద్దకు పల్లకీ ఊరేగింపు, రాత్రి 11 గంటలకు దేవీభాగవత పురాణ మహామంగళం, గురువారం ఉదయ సుప్రభాత సేవ, ఉదయం 8 గంటలకు గంగాస్నానం, పల్లకిసేవ, రాత్రి తొమ్మిది గంటలకు మహాభిషేకం, శతఘటాభిషేకం చేస్తారు. చివరి రోజు బోనాలు, మహాప్రసాద వితరణ జరుగుతందని తెలిపారు.
ఐదు రోజులపాటు దామర్‌చెడ్ జాతర
సుందరంగా ముస్తాబైన ఆలయ పరిసరాలు
తరలిరానున్న ఆధ్యాత్మిక గురువులు
ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ పీఠాధిపతి

దత్తాత్రేయ స్వామి విగ్రహం

ఆలయంలో భవానీమాత విగ్రహం