తిరుపతిలో మరో 500 మొబైళ్ల్లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

తిరుపతిలో మరో 500 మొబైళ్ల్లు స్వాధీనం

May 20 2026 12:11 AM | Updated on May 20 2026 12:11 AM

తిరుపతి క్రైమ్‌: జిల్లా పోలీసులు కేంద్ర ప్రభుత్వ మొబైల్‌ గుర్తింపు వ్యవస్థ సహాయంతో 14వ దశ మొబైల్‌ రికవరీ మేళాలో రూ.కోటి విలువైన 500 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు. ఇప్పటివరకు మొత్తం 4,785 మొబైల్‌ ఫోన్లను తిరిగి అప్పగించినట్లు జిల్లా ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గుర్తించిన మొబైళ్లను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్న వారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే కేంద్ర ప్రభుత్వ మొబైల్‌ గుర్తింపు వ్యవస్థలో ఫిర్యాదు నమోదు చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. 94906 17873 వాట్సాప్‌ నంబర్‌కు ‘‘హాయ్‌’’ అని సందేశం పంపితే ఫిర్యాదు నమోదు విధానం, పూర్తి సాంకేతిక సహాయం అందుతుందని తెలిపారు. మొబైల్‌ పోయిన వెంటనే సిమ్‌ కార్డు బ్లాక్‌ చేయించుకోవాలని, వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలని, డిజిటల్‌ చెల్లింపు దరఖాస్తులకు బలమైన సంకేత పదాలు ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. మొబైల్‌ రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్‌ నేర విభాగం సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

మద్యం తాగి ఆర్టీసీ బస్సులో యువకుల వీరంగం

నాగలాపురం: స్థానిక ఈస్టు హరిజనవాడకు చెందిన ముగ్గురు యువకులు సోమవారం మధ్యం తాగి, సత్యవేడు నుంచి తిరుపతికి బయలుదేరుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కి వీరంగం చేశారు. వారి ప్రవర్తనతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీంతో డ్రైవర్‌ వారిని బస్సు నుంచి దిగేయాలని హెచ్చరించారు. దీంతో ఆగ్రహించిన యువకులు బస్సు వెనుక బాగంలో ఉన్న టైరు గాలి తీసి వేశారు. తాము లేకుండా బస్సు ఎలా వెళుతుందో చూస్తామని డ్రైవర్‌ని బెదిరించారు. ఈ ఘటనతో బస్సు నాగలాపురం బస్టాండ్‌ వద్దనే నిలిచిపోయింది. అనంతరం డ్రైవర్‌ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఐ సునీల్‌ అల్లర్లకు పాల్పడిన యువకులు, వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి, ఇలా అల్లర్లకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం బస్సు టైర్‌ మరమ్మతుకు అయ్యే ఖర్చు వారి వద్ద నుంచి వసూలు చేయించారు. యువకులు ఒక్కొక్కరికి రూ.2 వేలు అపరాధం విధించారు. అల్లర్లకు పాల్పడితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement