విద్యుత్‌ షాక్‌తో బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో బాలుడి మృతి

May 20 2026 12:11 AM | Updated on May 20 2026 12:11 AM

– వైఎస్సార్‌సీపీ నేత ఇంట విషాదం

రామచంద్రాపురం: వేసవి సెలవుల్లో మేనత్త ఇంటికి వెళ్లి విద్యుత్‌ షాక్‌తో బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు, మండలంలోని యాగప్పరెడ్డి కండ్రిగ (మూల సపర్లు) గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు బాదూరు అర్జున్‌ రెడ్డి కుమారుడు పునీత్‌ రెడ్డి (7) వేసవి సెలవుల కోసం చంద్రగిరి మండలం ఏ రంగంపేటలోని తన మేనత్త ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రాస్‌ కట్టర్‌ వైర్లు తగిలి విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన బాలుడి మేనత్త ఆందోళనతో పుతిన్‌ను కాపాడేందుకు ప్రయత్నించగా ఆమె కూడా విద్యుత్‌ షాక్‌ గురైంది. స్థానికుల సాయంతో ప్రమాదానికి గురైన వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే పుతిన్‌ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. చిన్నారి ఆకస్మిక మృతితో కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

అర్హులందరికీ మత్స్యకార సేవా పథకం

తిరుపతి అర్బన్‌: మత్స్యకార సేవా పథకం ద్వారా అర్హులైన మత్స్యకారులందరికీ రూ.20 వేలు ఇస్తున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో మత్స్యకార సేవా పథకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 3,099 మంది మత్స్యకారులకు వేట నిషేధిత కాలంలో ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో రూ.20వేలు చొప్పున డీబీటీ పద్ధతిలో చెల్లింపులు జరిగాయన్నారు. కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని మత్స్యకారులకు, తమిళనాడు మత్స్యకారుల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని చెప్పారు. అలాగే వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, కురుగొండ్ల రామకృష్ణ, బొజ్జల సుధీర్‌రెడ్డి, పులవర్తి నాని, పాశం సునీల్‌కుమార్‌, తుడా చైర్మన్‌ డాలర్‌ దివాకర్‌రెడ్డి, జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రెండు వాహనాలు ఢీ.. వ్యక్తి మృతి

రాపూరు: రాపూరు–పెంచలకోనలో జాతీయరహదారిలోని ఏపూరు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కథనం మేరకు..మైదుకూరు నుంచి వస్తున్న మినీ లారీ, రాపూరు నుంచి స్కూటర్‌పై గుండవోలుకు వెళుతున్న లక్ష్మయ్య(28) రెండు వాహనాలు ఢీ కొనడంతో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. రాపూరు మండలం గుండవోలు గిరిజనకాలనీకి చెందిన లక్ష్మయ్య రాపూరులో చేపలు అమ్ముకుని, స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతునికి భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement