రేణిగుంట: మండలంలోని తూకివాకం సమీపంలో నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి లో మంగళవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు.. పుత్తూరు మండలం, తిమ్మాపురం గ్రామానికి చెందిన ఎల్లప్పగారి అనిత (31) సొంత పని నిమిత్తం మంగళవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై పుత్తూరు నుంచి తిరుపతికి వస్తుండగా తూకివాకం సమీపంలో స్కూటర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనింది. ఈ ఘటనలో మహిళ అక్కడకక్కడే మృతి చెందింది. గాజులమండ్యం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
ఘాట్‌రోడ్డులో
కొండచిలువ హల్‌చల్
తిరుమల: తిరుమల ఘాట్‌రోడ్డులోని మోకాళ్ల మెట్టు వద్ద కొండచిలువ హల్‌చల్ చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని మోకాళ్ల మెట్టు వద్ద 11 అడుగుల కొండచిలువ రోడ్డు సమీపంలో ఉండగా స్థానికులు, భక్తులు గుర్తించిచ భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి సమాచారం అందించగా ఆయన దానిని చాకచక్యంగా పట్టుకుని, అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని మైసూరవారిపల్లి మార్కెట్‌యార్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున టీ కొట్టు నడుపుకుని జీవనం సాగించే కల్లు రామచంద్రారెడ్డిని (65)ని హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నెల్లూరుజిల్లా ఆత్మకూరు మండలం, ఏఎస్‌పేట నివాసిగా గుర్తించారు. విషయం బంధువులకు తెలిపి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


