శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని మాధవమాల రెవెన్యూ పరిధిలోని దళితుల శ్మశాన భూమిని ఓ రైతు ఆక్రమించడంపై ఆ గ్రామ దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 51లో మొత్తం 11.66 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 1.50 ఎకరాల భూమిలో మాధవమల హరిజనవాడ శ్మశానం కోసం ప్రభుత్వం కేటాయించింది. అయితే ముచ్చివోలు గ్రామానికి చెందిన ఓ రైతు శ్మశానం కోసం కేటాయించిన 1.50 ఎకరాల్లో కొంత భాగాన్ని ఆక్రమించి, చదును చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై దళితులు అతడిని ప్రశ్నించగా, ‘‘మీ మీదే కేసులు పెడతాను’’ అంటూ ఎదురుదాడికి దిగి బెదిరిస్తున్నాడని బాధితులు ఆవేదన చెందుతున్నారు. గతంలో నాయకుల ఆదేశాల మేరకు పలుసార్లు రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే చేసి స్థలాన్ని కేటాయించి హద్దులు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ రైతు దౌర్జన్యానికి పాల్పడడంపై దళితులు ఆందోళన చెందుతున్నారు. శ్మశాన భూమి కబ్జా గురి కాకుండా చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని జిల్లాస్థాయి అధికారులను దళితులు కోరుతున్నారు.


