తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 80,455 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 43,309 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.41 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
ఫ్యాక్టరీలకు వందల టన్నుల యూరియా
తొట్టంబేడు: ఫ్యాక్టరీల్లో ఇష్టారాజ్యంగా యూరియా వాడేస్తున్నారు. ఫ్లైవుడ్, గాజుపెంకులు, సీరామిక్ టైల్స్ తదితర ఉత్పత్తుల్లో ఈ యూరియాను రకరకాలుగా వినియోగిస్తున్నారు. అందుకోసం వందల టన్నుల యూరియాను ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. శ్రీకాళహస్తి సమీపంలోని పలు ఫ్యాక్టరీల్లో టన్నుల కొద్దీ యూరియాను నిల్వ చేసి వినియోగిస్తున్నారు. వీరందరికీ యూరియా కొరత లేకుండా అధికారులు దగ్గరుండి అందిస్తున్నారు. కానీ పది మందికీ పట్టెడన్నం పెట్టే అన్నదాతలకు యూరియా లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఇచ్చే ఒకటిరెండు బస్తాలకు సవాలక్ష ఆంక్షలు విధిస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఫ్యాక్టరీలకు యూరియా కొరత లేనప్పుడు.. వ్యవసాయానికి ఎందుకు కొరత వస్తుందో అధికారులే చెప్పాలి.
శ్రీవారి సేవలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి
తిరుమల: ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ మంగళవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
30న గరుడసేవ
తిరుపతి అన్నమయ్యసర్కిల్: శ్రీ వేద నారాయణ స్వామివారి కంచి గరుడసేవ ఈ నెల 30న నాగలాపురం ఆలయంలో నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. కంచిలోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో నిర్వహించే మహా గరుడసేవను పురస్కరించుకొని ఈ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ వేద నారాయణ స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ అధికారులు కోరారు.
నేటితో ముగియనున్న
అగ్రి, ఫార్మసీ పరీక్షలు
తిరుపతి సిటీ: ఏపీ ఈఏపీసెట్‌లో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఐదు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు తొలిరోజు 2వేల మందికి గాను 91.9 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. నేటితో ముగియనున్న ఈ పరీక్షలకు బుధవారం మరో 2వేల మంది పరీక్షకు హాజరుకానున్నారు.


