భాకరాపేట: చిన్న గొట్టిగల్లు మండలంలో భాకరాపేటలో ఆదివారంజరిగిన జల్లికట్టు(ఎద్దుల పందేలు) పోటీలు దుమ్మరేపాయి. కోడెగిత్తలు రంకెలేసుకుంటూ దూసుకుపోగా ఎద్దులను నిలువరించి పలకలు పట్టేందుకు యువత పోటీపడింది. కొన్ని ఎద్దుల వేగాన్ని నిలువరించి పలకలు పట్టి యువకులు ఆనందం పంచుకున్నారు. ఈ పోటీల్లో ఎద్దుల కిందపడి పలువురు గాయపడ్డారు. ఈ జల్లికట్టులో జగన్ నినాదం మారుమోగింది. యువత పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి చిత్ర పటంతో కూడిన పలకలు, వైఎస్సార్ సీపీ జెండాలతో ప్రదర్శన చేపట్టారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సహదేవ రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ మండల అధ్యక్షుడు సింహాల మోహన్, మాజీ సర్పంచ్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
జల్లికట్టులో అపశ్రుతి
భాకరాపేటలో జరిగిన జల్లికట్టులో జనసేన, టీడీపీ కోడెగిత్తలను ర్యాలీగా తీసుకెళుతున్న తరుణంలో ఎగువూరు పంచాయతీ, పాలమాకులవారి పల్లికి చెందిన రవిచంద్ర(50)ను కోడిగిత్త పొడిచింది. అతనికి మెడ భాగంలో నుంచి తల పైకి ఎద్దు కొమ్ము చొచ్చుకుపోయింది. తీవ్ర రక్తస్రావం అవడంతో దగ్గరలోని భాకరాపేట ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ప్రథమ చికిత్స చేసి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రవిచంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


