– నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
తిరుపతి అర్బన్: అర్జీదారులు తాము ఇచ్చే అర్జీ లను తప్పులు లేకుండా స్పష్టంగా ఇవ్వాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సోమవా రం కలెక్టరేట్‌తోపాటు మండల, డివిజన్ స్థాయిలో పీజీఆర్‌ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కారం కాకుంటే మళ్లీ అర్జీలు ఇవ్వాల్సిన పనిలేదని చెప్పారు. గతంలో ఇచ్చిన అర్జీకి అధికారులు ఇచ్చిన స్లిప్‌ను మాత్రమే చూపిస్తే సరిపోతుందని పేర్కొ న్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు పీజీఆర్‌ఎస్ ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో ప్రతి విభాగానికి చెందిన అధికారి సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. అర్జీల సమాచారాన్ని తెలుసుకోవడానికి 1100 కాల్ చేయాలని సూచించారు. మీ కోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా అర్జీలను నమోదు చేసుకునే సౌకర్యం ఉందని వివరించారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 80,841 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,559 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.45 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
వేదోక్తంగా పాదుక పూజ
శ్రీకాళహస్తి: పట్టణంలోని శుకబ్రహ్మాశ్రమంలో ఆదివారం సద్గురు విద్యాప్రకాశానందగిరి స్వామి 113 వ జయంతిని పురస్కరించుకొని స్వామి వారి పాదుకులకు విశేష అభిషేక పూజలు నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతులు విద్యా స్వరూపానందగిరి స్వామి, ఉత్తరాధికారి సంపూర్ణానందగిరి స్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. ధర్మమార్గాన్ని అనుసరించాలని కాళీ వనాశ్రమ అధిపతులు యోగిని చంద్ర ప్రసాద కాళీ మాతాజీ పిలుపునిచ్చారు. పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, ముక్కంటి ఆలయ మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పాల్గొన్నారు.


