సూళ్లూరుపేట: టీడీపీ ఆవిర్భావ వేడుకలో తెలుగు తమ్ముళ్ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, సూళ్లూరుపేట టీడీపీకి గాడ్‌ఫాదర్‌లా వ్యవహరిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త కొండేపాటి గంగాప్రసాద్ సమక్షంలోనే తెలుగు తమ్ముళ్లు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో వివాదాలు చేసుకున్నారు. ఆదివారం సూళ్లూరుపేట పట్టణంలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ సభలో పేర్లను పిలిచే క్రమంలో వేనాటి సతీష్‌రెడ్డి వర్గీయులు, పార్టీలో సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్‌రెడ్డి మధ్య వివాదాలు బహిర్గతం అయ్యాయి. సుధాకర్‌రెడ్డిని ఎమ్మెల్యే విజయశ్రీ, గంగాప్రసాద్ వారించినా వినకుండా ముందుకొచ్చి మరీ గట్టిగా మాట్లాడడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి వేనాటి సతీష్‌రెడ్డి ఎమ్మెల్యే నిర్వహించే కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఆవిర్భావ సభలో ఆయనతో పాటు ఆయన వర్గీయులు ఉన్నట్టుండి ప్రత్యక్షం కావడం అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. సతీష్‌రెడ్డి వర్గీయులను వేదికపై ప్రొటోకాల్ ప్రకారం పిలవాలని చెప్పడంతో వేదికపైనే సుధాకర్‌రెడ్డి, సతీష్‌రెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ క్రమంలో వేదిక దిగువ భాగంలో ఉన్న సతీష్‌రెడ్డి వర్గీయులు పేర్లు పిలవలేదని పెద్ద ఎత్తును కేకలు వేయడంతో వేదికపై వెనుక భాగంలో ఉన్న సుధాకర్‌రెడ్డి అందరినీ తోసుకుంటూ ముందుకొచ్చి వారిపై విరుచుకుపడి మాట్లాడటం విమర్శలకు దారితీసింది. పార్టీలో సీనియర్ నాయకుడనని చెప్పుకునే ఆయన ఒక్క ఉదుటను రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎమ్మెల్యే విజయశ్రీ ఏంది సార్ ఇది.. అని అంటే ఆమెకు కూడా వేలు చూపించి మరీ వాదించడం విమర్శలు చెలరేగాయి. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రూపుల వివాదం నడుస్తుండడం. ఇప్పుడు మరోసారి బహిర్గతం అయ్యాయని తెలుగుతమ్ముళ్లు అంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ కార్యాలయం వేనాటి వారికి చెందిన రూమ్‌లో మాత్రమే నడిచింది. ఎన్ని వివాదాలున్నా నాయకులు, కార్యకర్తలు ఇక్కడే కార్యక్రమాలు చేసేవారు. 2024లో అధికారం వచ్చాక పార్టీ కార్యాలయాన్ని మార్చడానికి సుధాకర్‌రెడ్డే శ్రీకారం చుట్టి తన లాడ్జిని కార్యాలయంగా మార్చేయడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అక్కడికే వెళుతున్నారు. ఇలా వివాదాలు చినికి చినికి గాలివానగా మారి ఆవిర్భావ సభ గందరగోళంగా మారింది. పార్టీ స్థాపించిన ఎన్‌టీఆర్‌ను మరిచి పదవుల ప్రాపకం కోసం వాదులాడుకోవడం విమర్శలకు దారి తీసింది.


