పెన్నాలోకి రోడ్డేసిన ఘనులు | - | Sakshi
Sakshi News home page

పెన్నాలోకి రోడ్డేసిన ఘనులు

Mar 30 2026 7:20 AM | Updated on Mar 30 2026 7:20 AM

● ఆగని ఇసుక అక్రమ రవాణా ● చెలరేగిపోతున్న ఇసుకాసురులు

కలువాయి (సైదాపురం): నిన్నటి వరకు తెలుగురాయపురం నందు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అక్రమార్కులు ప్రస్తుతం రాజుపాళెం నందు ఏకంగా పెన్నాలోకి రహదారి నిర్మించి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. పొక్లయిన్ల సహాయంతో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. మీడియాలో వరుస కథనాలు వస్తే మమ్మల్ని ఏం చేస్తారు అంటూ బహిరంగంగానే అక్రమంగా ఇసుక తరలిస్తుంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగురాయపురం, రాజుపాళెం నందు రోజుకు వందల లారీలు తరలి వెళ్తోంది. ఇది పెన్నా నది ప్రవాహానికి ముప్పు ఏర్పడుతుందని తెలిపినా అక్రమంగా ఇసుక రవాణాను ఆపేందుకు ఏ అధికారి సాహసించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేగాక హైవేపై భారీ టిప్పర్లు వెళ్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లు ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వందల టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తుండడంతో పెన్నాలో ఇసుక మిగులుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కుల్లూరు హైవే పక్కన ఇసుక డంపింగ్‌ యార్డ్‌ అనధికారికంగా ఏర్పాటు చేశారు. పెన్నాలోకి అఢ్డంగా రహదారి నిర్మించడం వల్ల పెన్నా నది వారధి వెంబడి పంటలు వేసిన రైతులకు నీరు అందని పరిస్థితి కూడా నెలకొంటోంది. ఇసుక అక్రమ రవాణాపై వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి , నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులతో తెలుగురాయపురం అక్రమ రీచ్‌లో సాక్షాలతో అకమ రవాణా విషయాన్ని బయట పెట్టినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తుపాన్లు వచ్చినప్పుడు నది ప్రవాహం పొలాలు, గ్రామాలపై పొంగి పొర్లే ప్రమాదం ఉందని, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని తెలిసినా అక్రమ రవాణా ఆపే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

పెన్నానదిలో టిప్పర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement