సాంకేతికతకు అధిక ప్రాధాన్యం
నాయుడుపేట టౌన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ విద్యార్థుల్లో సాంకేతికతను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. నాయుడుపేట జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానికి ప్రదర్శనను అట్టహాసంగా ప్రారంభించినట్లు తెలిపారు. సూళ్లూరుపేట ఎమ్మె ల్యే నెలవల విజయశ్రీ ముఖ్యఅతిథిగా హాజరై, ప్రదర్శనను ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ నాయుడుపేటలో జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించేందుకు జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించిన ఎంఈఓలతో పాటు పలువురు ప్రత్యేక అధికారులు ఎంతో సహకరించారన్నారు. ఈ ప్రదర్శనలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 126 గ్రూపుల విద్యార్థులు, వ్యక్తిగత విభాగం నుంచి 65 మంది విద్యార్థులు, టీచర్ల ప్రోత్సాహంతో జరిగిన 34 సైన్స్ నమూనాలను ప్రదర్శించారన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కె భానుప్రసాద్, గూడూరు డిప్యూటీ డీఈఓ దువ్వూరు సనత్‌కుమార్, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం మంజుల, ఎంఈఓలు మాధవీలత, బాణాల మునిరత్నం, తదితరులు పాల్గొన్నారు.
గెలుపొందిన పాఠశాలల వివరాలివీ..
విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో వ్యక్తిగత విభాగంలో జిల్లా స్థాయిలో చెన్నూరు ఉన్నత పాఠశాలకు చెందిన కే సురేష్‌రెడ్డి, పాకాల మండలం ఓబులవారిపల్లి పాఠశాలకు చెందిన కే రాజశేఖర్ విజేతలుగా నిలిచారు. టీచర్స్ విభాగంలో శ్రీకాళహస్తి మండలం మాచువోలు ఉన్నత పాఠశాలకు చెందిన డాక్టర్ ఎన్ సుబ్రమణ్యశర్మ, చిల్లకూరు గురుకుల పాఠశాలకు చెందిన వైవీ సురేష్‌బాబులు జిల్లా స్థాయిలో గెలుపొందారు. గ్రూపు విభాగంలో జిల్లాలోని 14 ఉన్నత పాఠశాలలు ప్రతిభ కనపరిచి విజేతలుగా నిలిచినట్లు డీఈఓ వెల్లడించారు.
సాంకేతికతకు అధిక ప్రాధాన్యం


