12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: రేణిగుంట – రైల్వేకోడూరు రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో రవాణా చేస్తున్న 12 ఎర్రచందనం దుంగలను గుర్తించి, స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, పైలట్‌గా ఉపయోగిస్తున్న బైక్‌ను సీజ్ చేశారు. ఆర్‌ఐ సాయి గిరిధర్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ లింగాధర్ టీమ్ ఎప్బీఓ పి.చెంగలరాయుడుతో కలసి శనివారం తెల్లవారుజాము నుంచి రైల్వే కోడూరు రోడ్డులోని ఆంజనేయపురం ఫారెస్ట్ చెక్ పోస్టు వద్దకు చేరుకుని వాహన తనిఖీలు చేపట్టారు. సుమారు 5 గంటల ప్రాంతంలో ఒక బైక్‌లో ఒక వ్యక్తి వచ్చి, పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అతన్ని పట్టుకోగా, వెనకే వస్తున్న కారు తప్పించుకునేందుకు ప్రయత్నించింది. దీంతో కారును చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, డ్రైవర్ కారును తప్పించబోయి అక్కడే ఆగి ఉన్న లారీని ఢీ కొన్నాడు. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. కొందరు వ్యక్తులు దిగి పారిపోతుండగా టాస్క్‌ఫోర్సు పోలీసులు వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారులోని ఎర్రచందనం దుంగలు, వాహనాలుసహా ముగ్గురు స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన వారిలో ఒకరు రేణిగుంటకు చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు తమిళనాడు సేలం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.


