మోంథా.. కలవరింత
వాకాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం తీవ్ర వాయుగుండంగా మారడంతో సముద్రం అల్లకల్లోలమై, తీరం కోతకు గురవుతోంది. దీంతో జిల్లాలోని తీర ప్రాంత మత్స్యకారులు, ప్రజల్లో వణుకు పుట్టుకొస్తుంది. జిల్లా అంతటా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చలిగాలులు వీస్తున్నాయి. తిరుపతి జిల్లాలోని వాకాడు, కోట, చిల్లకూరు, తడ, సూళ్లూ రుపేట మండలాల్లో 75 కిలోమీటర్ల పొడవున ఉన్న సముద్ర తీరంలో 58 తీరప్రాంత గ్రామాలున్నాయి. అందులో 4,879 కుటుంబాలు సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ కొట్టుమిట్టాడుతున్నారు. సముద్ర తీరం వెంబడి భీకరమైన శబ్దాలతో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఆయా గ్రామాల ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లా సైక్లోన్ స్పెషల్ ఆఫీసర్‌గా అరుణ్‌బాబును నియమించారు. మోంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు. దుగ్గరాజపట్నం మైరెన్ పోలీసులు సముద్రానికి కిలో మీటరు దూరంలోనే భద్రతా బారికేడ్లు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. స్పెషల్ ఆఫీసర్ అరుణ్‌బాబుతోపాటు మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మైరెన్ ఉన్నతాధికారులు తన సిబ్బందితో తీర ప్రాంత మండలాల్లో పర్యటించి ప్రజ లను అప్రమత్తం చేస్తున్నారు. ఆక్వా రైతుల గుండెల్లో మోంథా తుపాన్ దడపుట్టిస్తుంది. ఈ క్రమంలో రైతులు తమ చెరువులను ఖాళీ చేసే క్రమంలో తక్కువ కౌంటుతోనే రొయ్యలను పట్టుకుని వచ్చిన వరకు సొమ్ము చేసుకుంటున్నారు.
విద్యుత్ శాఖ అప్రమత్తం
తిరుపతి రూరల్: మోంథా తుపాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఇప్పటికే ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించారు. నెల్లూరు సర్కిల్‌కు ఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ జె.రమణా దేవి, తిరుపతి సర్కిల్‌కు చీఫ్ జనరల్ మేనేజర్ పి.సురేంద్ర నాయుడు, చిత్తూరు సర్కిల్‌కు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. ఉమాపతిని నియమించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని సర్కి ల్స్, డివిజనల్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పా టు చేసినట్టు తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, లైన్లు తెగిపడడం వంటి సంఘటనలు గుర్తిస్తే విద్యుత్ శాఖ సిబ్బందికి గానీ, టోల్ ఫ్రీ నంబర్ 1912, 1800425155333కు కాల్ చేసి సమాచారం అందజేయాలన్నారు. అలాగే సంస్థ వాట్సాప్ నంబర్ 9133331912కు చాట్ చేయాలని సూచించారు.
రాయలచెరువును పరిశీలిస్తున్న అధికారులు
మల్లెమడుగు గేట్ల ఎత్తివేత
రేణిగుంట: మండలంలోని మల్లెమడుగు రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో సోమవారం అధికారులు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ప్రస్తుతం ఎగువ భాగం నుంచి 700 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులకు తెలిపారు.
పెరుగుతున్న రాయలచెరువు నీటిమట్టం
మోంథా.. కలవరింత


