‘పాపవినాశనం’లో గంగ పూజ
తిరుమల : తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తిస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆదివారం పాపవినాశనం డ్యామ్ వద్ద టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మకు హారతి సమర్పించారు. ఆయన మాట్లాడుతూ తిరుమలలోని జలాశయాలు 95 శాతం నిండిపోవడం శుభ పరిణామమన్నారు. పాపవినాశనం, గోగర్భం డ్యామ్ లు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. భక్తుల అవసరం కోసం తిరుమలలో ప్రతిరోజూ 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుందని, తిరుపతిలోని కల్యాణి డ్యామ్ నుంచి 25 లక్షల గ్యాలన్లు, తిరుమలలోని డ్యామ్‌ల నుంచి 25 లక్షల గ్యాలెన్ల నీటిని వినియోగిస్తున్నామన్నారు. తిరుమలలో 250 రోజుల అవసరాలకు సరిపడే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. డ్యామ్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి అవసరాలను సక్రమంగా నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ శాఖను అభినందించారు. అలాగే టీటీడీ చరిత్రలో మొదటిసారి ఈ ఏడాది భారీ విరాళాలు వచ్చాయని తెలిపారు. గడిచిన 11 నెలల కాలంలో టీటీడీ ట్రస్టులకు రూ.918 కోట్లు విరాళాలు అందినట్లు వివరించారు. కార్యక్రమంలో టీటీడీ సీఈ సత్య నారాయణ, ఈఈలు సుబ్రమణ్యం, శ్రీనివాసరావు, సుధాకర్, డిప్యూటీ ఈఓ లోకనాథం, వీజీఓ సురేంద్ర పాల్గొన్నారు.


