ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం
తిరుపతి అర్బన్ : ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని, ఈ అంశాన్ని ప్రజలు గుర్తించాలని డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్(డీసీటీఎం) మేనేజర్ విశ్వనాథం తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కర్నూలు బస్సు ప్రమాదం దురదృష్టకరమన్నారు. జిల్లాలోని 11 ఆర్టీసీ డిపోల్లో 955 ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. అందులో 122 ఏసీ బస్సులు ఉన్నాయని చెప్పారు. అలిపిరి డిపో నుంచి 100 విద్యుత్ బస్సులు నడుస్తున్నాయన్నారు. ఆర్‌టీసీ ఏసీ బస్సుల్లో అగ్నిప్రమాద సంభవిస్తే వెంటనే మంటలను అదుపు చేసే పరికరాలు ఉన్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో అద్దాలు పగులగొట్టేందుకు వీలుగా ప్రత్యేక సామగ్రి ఉందని వెల్లడించారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ సక్రమంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ప్రధానంగా డ్రైవర్లు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారా తెలుసుకోవడానికి పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 55 ఏళ్ల పైబడిన వారిని పల్లెవెలుగు బస్సుల్లో డ్యూటీలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్టీసీ డ్రైవర్లకు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. డ్యూటీకి వెళ్లేప్పుడు తప్పనిసరిగా బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయిస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే నిత్యం 300 బస్సులు ప్రమాదకరమైన తిరుమల ఘాట్‌లో సురక్షితంగా నడుస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం
ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం


