హాస్టల్ ఉద్యోగి మృతి
తిరుపతి సిటీ : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల హాస్టల్‌లో కుక్‌గా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి టి.ముద్దు కృష్ణ ఆదివారం గుండోపోటుతో మృతి చెందారు. ఉదయం విధులకు హాజరైన ఆయన వంటగదిలో ఆవిరి ముఖానికి తాకడంతో ఊపిరాడక గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. అధికారులు వంటగదిలో తగిన సదుపాయలు కల్పించడంలో విఫలమయ్యారని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీ నగర్‌కు చెందిన ముద్దుకృష్ణకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నట్లు సమాచారం. ఆయన మరణంతో కుటుంబంలో భార్య, పిల్లలు అనాథలుగా మారారు. వారి కుటుంబీకుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.
పని ఒత్తిడితోనే ..
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై పని భారం అధికమవడంతో ఒత్తిడికి గురై ప్రాణాలు వదులుతున్నారు. మరికొందరు దీర్ఘకాలిక వ్యాధులతో అనారోగ్యాలకు గురై విధుల నుంచి తప్పుకుంటున్నారు. పలు విద్యా సంస్థలలో ఇప్పటికే పదుల సంఖ్యలో ఘటనలు జరిగినా టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ఒక్కో హాస్టల్ వంటశాలలో కనీసం 15 మందికి పైగా పనిచేయాల్సి ఉండగా కేవలం 5 నుంచి ఏడుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వారిపై పని ఒత్తిడి అధికమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు.
రూ.25లక్షల పరిహారానికి డిమాండ్
పద్మావతి డిగ్రీ కళాశాల హాస్టల్ ఉద్యోగి మరణానికి పని ఒత్తిడే కారణమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం ఆరోపించారు. ముద్దు కృష్ణ కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని, వారి కుటుంబంలో ఒక్కరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హాస్టల్ ఉద్యోగి మృతి


