ఐక్యతతోనే సమస్యల పరిష్కారం
తిరుపతి రూరల్ : విద్యుత్ సంస్థల్లోని ఇంజినీర్లందరూ ఐక్యమత్యంతో పోరాటం చేస్తేనే సమస్యల పరిష్కారం సాధ్యమని ఏపీఎస్‌ఈబీ ఇంజినీర్లు సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో ఏపీఎస్‌ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శామ్యూల్, ప్రధానకార్యదర్శి నాగప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ ఇంజినీర్ల సంఘం ఏర్పాటు చేసి 50 ఏళ్లు గడిచాయని తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమష్టి పోరాటాలతోనే అనేక సమస్యలను పరిష్కరించుకున్నామని వెల్లడించారు. ఖాళీగా ఉన్న ఏఈల పోస్టుల భర్తీకి యాజమాన్యాలతో చర్చలు సాగిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఉద్యోగోన్నతులు, నూతన జిల్లాలకు అదనపు పోస్టులు మంజూరు, కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన వంటి సమస్యలపై పోరాడనున్నట్లు వివరించారు. అత్యవసర సమయాల్లో కష్టపడిన ఇంజినీర్లకు తగిన గౌరవం, గుర్తింపు లభించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర నేతలను డిస్కం యూనియన్ నేతలు సత్కరించారు. నేతలు కేవీ రామారావు, డి.నాగరాజు, కృష్ణప్రసాద్, లక్ష్మణరావు, జయప్రకాష్, మునిప్రసాద్, ఆంజనేయులు, రమేష్, సతీష్ వెంటకలక్ష్మి, స్వాతి పాల్గొన్నారు.
నిబంధనలు పాటించని బస్సులు సీజ్
తిరుపతి మంగళం : నిబంధనలు పాటించకుండా రాకపోకలు సాగిస్తున్న 13 ప్రైవేట్ బస్సులను రవాణాశాఖ, పోలీస్ అధికారులు సీజ్ చేశారు. ఆదివారం ఈ మేరకు వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చిన ప్రైవేట్ బస్సులను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలను అతిక్రమించిన 13 బస్సులను సీజ్ చేశారు. 27 వాహనాలపై కేసు నమోదు చేశారు. అధికారులు మాట్లాడుతూ ధ్రువీకరణ పత్రాలతోపాటు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. అలాగే సురక్షిత ప్రయాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలని జిల్లా రవాణా శాఖ అధికారి కొరప్రాటి మురళీమోహన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బస్సులను మంగళం ఆర్టీసీ డిపోకు తరలించారు. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, నగర డీఎస్పీ భక్తవత్సలం, ట్రాఫిక్ డీఎస్పీ భక్తవత్సలం, సీఐలు, మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, మోహన్ కుమార్, ఆంజనేయ ప్రసాద్, ఆంజనేయ వర్మ పాల్గొన్నారు.
ఐక్యతతోనే సమస్యల పరిష్కారం
ఐక్యతతోనే సమస్యల పరిష్కారం


