కళ్లకు గుంతలు!
స్వర్ణముఖిలో బరితెగించిన ఇసుకాసురులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : తిరుపతి రూరల్ మండలం పరిధిలోని వేదాంతపురం, కేసీపేట, చిగురువాడ, దుర్గసముద్రం, అడపారెడ్డిపల్లె, శివగిరి ప్రాంతాల్లోని ఇసుకాసులు బరితెగించేశారు. స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. భారీ యంత్రాలతో తవ్విన గోతుల్లోకి భారీగా వరదనీరు చేరడంతో అందులో పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
అడ్డుకట్ట పడేనా..?
వేదాంతపురం వద్ద స్వర్ణముఖి నదిలో నలుగురు బాలురు మృత్యువాత పడిన తర్వాతైన ఇసుకాసురులకు అధికారులు చెక్ పెడతారా అని పరీవాహక గ్రామాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగినప్పుడు అధికారులు హడావుడి చేయడం కంటే ఆ ప్రమాదానికి కారణమైన ఇసుక తవ్వకాలకు అడ్డుకోవాలని కోరుతున్నారు. స్వర్ణముఖి నదిలో వర్షాకాలం ముగిసేంత వరకు తవ్వకాలు జరగకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్రమార్జనకే ప్రాణాలు బలి
ఇసుకాసురులు కేవలం అక్రమార్జనకే ప్రాధాన్యమిస్తున్నారని, ఎన్ని ప్రాణాలు పోయినా కనికరించడం లేదని పరీవాహక గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు కఠిన వైఖరి తీసుకోకుంటే మరింత మంది బలవుతారని హెచ్చరిస్తున్నారు.
స్వర్ణముఖిలో ఉసురు తీస్తున్న గుంతలు ఇవే..
కూటమి నేతల అండతోనే ..
కూటమి నేతల అండదండలతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని నదీ పరీవాహక గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరిగినా అక్రమార్కులు లెక్క చేయడం లేదని మండిపడుతున్నారు. రోడ్లపైకి రావాలంటేనే భయంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రవాణా చేసే టిప్పర్లు, ట్రాక్టర్ల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయని, అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే స్వర్ణముఖి స్వరూపం మారిపోయిందని, సరిహద్దులను కూడా తవ్వేస్తుండడంతో గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అడపారెడ్డిపల్లె నుంచి తనపల్లె వరకు సుమారు 10కిలోమీటర్ల మేర నదికి ఇరువైపులా ఇసుక మేటలను తవ్వేశారని వెల్లడిస్తున్నారు.
కళ్లకు గుంతలు!


