శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. టెంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
వినియోగంలో లేని
వస్తువుల విక్రయం
తిరుపతి అర్బన్ : సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో వినియోగంలో లేని వస్తువుల అమ్మకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆ విభాగం జిల్లా అధికారి విక్రమకుమార్‌రెడ్డి శనివారం తెలిపారు. ఆసక్తి గలవారు కలెక్టరేట్ బి–బ్లాక్‌లోని మూడో అంతస్తు రూమ్ నంబర్ 309లో దరఖాస్తులు పొందవచ్చని వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో టెండర్లు ఓపెన్ చేస్తామని వివరించారు.
30 నుంచి శ్రీవారి మెట్లోత్సవం
తిరుమల : తిరుమల ఆస్థాన మండపంలో ఈ నెల 30 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు శనివారం వెల్లడించారు. అక్టోబర్ 31వ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహించనున్నట్లు వివరించారు.
సర్టిఫికెట్ల పరిశీలనకు
హాజరుకండి
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని భవిత కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఐఈఆర్‌పీ (సహిత విద్యా రిసోర్స్ పర్సన్)లు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని భవిత కేంద్రాల్లో పనిచేస్తున్న ఐఈఆర్‌పీలకు రెగ్యులర్ పే స్కేల్ అందజేసేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు సర్టిఫికెట్లను పరిశీలన చేయనున్నట్లు తెలిపారు.
3 తర్వాతే స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు మరో వారం రోజుల పాటు నిరీక్షించక తప్పని పరిస్థితి. ఇప్పటికే ఓఎండీసీ ఆధ్వర్యంలో ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ల పేరుతో రెండు విడతలుగా ప్రవేశాలు కల్పించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి మూడవ విడతగా వచ్చే నెల ఒకటో తేదీన అర్హత కలిగిన విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రకటించింది. దీంతో వచ్చేనెల 3వ తేదీ పైన ప్రభుత్వ, టీటీడీ కళాశాలల్లో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్ క్రీడా పోటీలు వాయిదా
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో ఈనెల 27వ తేదీ నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఇంటర్ కాలేజియేట్ క్రీడలను వాయిదా వేస్తున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం శివశంకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నవంబర్ ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నామని తెలిపారు. వచ్చేనెల 1న వాయిదా వేసిన క్రీడలను ఒకే రోజు నిర్వహిస్తామని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
నవోదయ, సైనిక్ పరీక్షలపై ఉచిత అవగాహన
తిరుపతి సిటీ: స్థానిక వరదరాజ నగర్‌లోని విశ్వం సైనిక్ నవోదయ పోటీ పరీక్షల కేంద్రంలో ఆదివారం ఉదయం 10గంటలకు నవోదయ సైనిక్ మోడల్ టెస్ట్‌పై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ విశ్వనాథ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాల కోసం 8688888802/03, 9399976999 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.
వేగంగా ఓటరు క్లెయిమ్‌ల పరిష్కారం
తిరుపతి రూరల్ : ఓటరు క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరిస్తున్నామని, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆర్‌డీఓ రామ్మోహన్ తెలిపారు. శనివారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఆర్‌డీఓ మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని పలుచోట్ల కొత్త కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.


