చెరువులకు జలకళ
తిరుపతి అర్బన్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. అలాగే వాగులు, వంకలు, కాలువలు సాగడంతో రైతులు ఈ ఏడాది పంట సాగుకు ఇబ్బంది ఉండవని భావిస్తున్నారు. ప్రధానంగా స్వర్ణముఖి నది సాగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీకి వర్షంతో రూ.కోటి నష్టం
మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రయాణికులు తగ్గిపోయారు. మరోవైపు ఆర్టీసీ అన్ని మార్గాల్లో తిప్పలేదు. దీంతో రోజుకు రూ.30 లక్షలు చొప్పున మూడు రోజుల్లో రూ.కోటికి పైగా నష్టం చోటుచేసుకుంది.
కూలిన పూరిగుడిసెలు
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆలత్తూరు గ్రామ దళితవాడలో ఒక పూరి గుడిసె, పట్టాభిగిరిజన కాలనీలో మూడు పూరిగుడిసెలు కూలాయి. పూరి గుడిసెలు కూలిపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రాత్రంతా వర్షానికి తడుస్తూ, చలి గాలులతో నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వం స్పందించి కూలిన పూరిగుడిసెలకు నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.
బురదలో కూరుకుపోయిన ఆర్టీసీ బస్సు
కలువాయి(సైదాపురం): మండలంలోని దాచూరు కొలపనాయుడుపల్లి గ్రామాల మధ్యలో గురువారం ఆర్టీసీ బస్సు బురదలో కూరుకుపోయింది. వర్షాలకు బురదమయం కావడంతో రోడ్డు పక్కన దిగిన బస్సు ఇరుక్కుపోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు.
20 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
వాకాడు: మండలంలో గురువారం దాదాపు 20 మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు అధికంగా రావడంతో వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్‌లో ఉధృతంగా ప్రవహిస్తోంది. దిగువన ఉన్న బాలిరెడ్డిపాళెం – గంగన్నపాళెం గ్రామాల మధ్య వంతెన నీట మునిగి ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సముద్రపు కెరటాలు తీర గ్రామాలను తాకుతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఒడ్డున ఉన్న తమ వేట సామగ్రిని భద్రపరుస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు, మైరెన్ అధికారులతోపాటు వాకాడు తహసీల్దార్ మహ్మద్ ఇగ్బాల్, ఎంపీడీఓ సాయిప్రసాద్ సముద్ర తీరాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. రొయ్యల కాలవ, పులికాలవ పొంగిపొర్లడంతో అక్కడక్కడా లోతట్టు రహదారులు నీటి మునిగిపోయాయి. బ్యారేజ్‌లో 35 ఎంసీటీఎఫ్ నీరు నిల్వ ఉండగా 8 గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు వరదనీటిని దిగువ ప్రాంతాలకు వదిలిపెట్టారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ హెచ్చరికలు జారీ చేశారు.
చెరువులకు జలకళ
చెరువులకు జలకళ
చెరువులకు జలకళ
చెరువులకు జలకళ


