
వైఎస్సార్ ఫొటోలను చేత పట్టి జేజేలు పలుకుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు
ఊరూరా రాజన్న సంబరాలు
ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
పలుచోట్ల అన్నదానం, రక్తదాన శిబిరాలు
కేక్ కటింగ్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు
వైఎస్సార్‌ను గుర్తుచేసుకున్న అభిమానులు
కేక్ కటింగ్‌లు, అన్నదానాన్ని అడ్డుకున్న పోలీసులు
తిరుపతి అర్బన్ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని జిల్లాలో ఊరూరా జరుపుకున్నారు. ప్రమాదంతో ఆయన ప్రజలకు దూరం అయినప్పటికీ ఆయన పాలనలో చేసిన మంచిని గుర్తుచేసుకుంటూ జయంతి వేడుకలను జరుపుకున్నారు. ప్రధానంగా వైఎస్సార్ పాలనలో అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయంబర్స్‌మెంట్, వ్యవసాయ రుణాలమాఫీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలను గుర్తుచేసుకున్నారు.
వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా పలుచోట్ల అన్నదానం , తిరుపతిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఊరువాడ తేడా లేకుండా ఆయన అభిమానులు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. అయితే ఓ మాజీ ముఖ్యమంత్రి మహానేత, పేదల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు జయంతి ఉత్సవాల్లో కేక్ కటింగ్, అన్నదానం చేస్తుంటే నాయుడుపేట, గూడూరులో పోలీసులు అడ్డుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అన్నదానం చేస్తే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పోలీసులు చెప్పడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
నియోజకవర్గాల్లో ఇలా..
● వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఆయనతో పాటు వెంకటగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ నక్కా భానుప్రియ, పార్టీ నేతలు రవికుమార్, కార్తీక్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేదురుమల్లి బంగ్లాలో చేపట్టిన వైఎస్సార్ జయంతి వేడుకలకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ అనంతరం అన్నదానం నిర్వహించారు.
● శ్రీకాళహస్తి నియోజకవర్గంలో.. పాలక మండలి మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలోని సినిమా వీధిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేపట్టారు. తర్వాత అన్నదానం చేశారు. రేణిగుంట మండలంలో హరిప్రసాద్‌రెడ్డి, తిరుమల రెడ్డి నేతృత్వంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఏర్పేడు మండలంలో రమణయ్య యాదవ్, తొట్టంబేడు మండలంలో సుబ్రమణ్యం ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు.
● సత్యవేడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని జరుపుకున్నారు. ప్రధానంగా నారాయణవనం, నాగలాపురం, సత్యవేడు మండల కేంద్రాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేశారు. వారితోపాటు కార్మిక విభాగం మాజీ చైర్మన్ బీరేంద్ర వర్మతో పాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేపట్టారు. మరో వైపు ఆయా మండల కేంద్రాల్లో మండల నేతలు పాల్గొన్నారు.
సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో పార్టీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. అయితే ఈ సందర్భంగా అన్నదానం చేయడాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పార్టీ నేతలు సర్ధి చెప్పి కార్యక్రమాన్ని కొనసాగించారు. మరోవైపు ఆయా మండల కేంద్రాల్లో మండల నేతల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ంగా చంద్రగిరి టౌన్ క్లాక్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. అలాగే పాకాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద కేక్ కటింగ్ చేపట్టారు. ౖలింగేశ్వర్‌నగర్‌లోను కేక్ కటింగ్‌తో పాటు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. రామచంద్రాపురం మండలంలోని నెన్నూరు, నిమ్మలగుంటపల్లి, ఎర్రావారిపాళెం మండలంలోని నెరబైలు, చిన్నగొట్టిగల్లు మండల కేంద్రాల్లోనూ కేక్ కటింగ్ చేపట్టారు.
గూడూరు నియోజకవర్గం సనత్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేరుగు మురళీధర్ నేతృత్వంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా చేపట్టారు. ముందుగా గూడూరులోని బనిగేసాహెబ్‌పేటలో కేక్ కటింగ్ చేయాలని భావించారు. అయితే పోలీసులు అనుమతి లేదని చెప్పడంతో సనత్‌నగర్‌లో నిర్వహించారు. అనంతరం గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పాలు అందించారు. ఈ సందర్భంగా గూడూరు అభివృద్ధికి వైఎస్సార్ పరిపాలనలో చేపట్టిన పలు అంశాలను గుర్తుచేసుకున్నారు. ఆయా మండల కేంద్రాల్లో మండల కన్వీనర్లు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేపట్టారు. పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
తిరుపతిలో వేడుకగా వైఎస్సార్ 76వ జయంతి వేడుకలు
● పేదలకు అన్నదానం, రక్తదాన శిబిరం ఏర్పాటు
● చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన
తిరుపతి మంగళం : ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఊరంతా నీ జ్ఞాపకాలే రాజన్నా.. పొలానికెళ్లినా..పట్టణానికి వచ్చినా నీ ప్రతిరూపాలే.. నీ పథకాలు పదిలం.. నిన్ను మేము మరువలేం! జోహార్ వైఎస్సార్.. జోహార్ వైఎస్సార్ అంటూ అభిమానులు చెమర్చిన కళ్లతో తమ అభిమాన నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నీవు మా మధ్య లేకపోయినా మా గుండె చప్పుడు నీవ్వే రాజన్నా అంటూ స్మరించుకున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుపతి తుడా సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డిలతో పాటు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు గజమాలతో ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ఫ్లకార్డులను చేతపట్టుకుని జోహార్ వైఎస్సార్ అంటూ నినదించారు.
అనంతరం 76 కిలోల భారీ కేక్‌ను కట్‌చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌వంశీ ఆధ్వర్యంలో సుమారు వంద మందికి పైగా రక్తదానం చేశారు. అనంతరం వెయ్యి మందికి పైగా పేదలకు భూమన కరుణాకరరెడ్డి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల ఆశాజ్యోతి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని, తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరికి కూడ వెరవకుండా ప్రజలకు సేవ చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రతి పేదవాడికి అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జీవించే ఉన్నారన్నారు.
వైఎస్సార్ 76వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ రోజు వైఎస్సార్‌సీపీ ఓడిపోయిందని కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలు, విధ్వంశాల ను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని దౌర్జన్యాలు చేయించినా తమ పార్టీ నాయ కులు, కార్యకర్తలకు అండగా నిలబడుతామన్నా రు. ఇప్పటికై నా తమ పార్టీ నాయకులు, కార్యకర్త లు, సానుభూతిపరులపైన దౌర్జన్యాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య,నేతలు

చంద్రగిరి: పేదలకు అన్నదానం చేస్తున్న చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

వెంకటగిరి: నివాళి అర్పిస్తున్న నేదురమల్లి రామ్ కుమార్, నేతలు

సత్యవేడు: అన్నదానం చేస్తున్న సమన్వయకర్త నూకతోటి రాజేష్

శ్రీకాళహస్తి: అన్నదానం చేస్తున్న అంజూరు శ్రీనివాసులు, నేతలు

వైఎస్సార్ ఫొటోలను చేత పట్టి జేజేలు పలుకుతున్న భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ రెడ్డి

గూడూరు: వైఎస్సార్ కాంస్య విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైఎస్సార్ సీపీ నేతలు

రక్తదానం చేస్తున్న భూమన అభినయరెడ్డి