కళ తప్పిన మామిడి మండీ
ధరలు లేక రైతులు విలవిల
కాయలు కోయకుండా ధర కోసం ఎదురు చూపు
పాకాల: మండలంలో సుమారు 8 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈ తోటల్లో 30 వేల నుంచి 35 వేల టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పాకాల చుట్టుపక్కల ప్రాంతాల్లో తోతాపురి, బేనీషా, ఖాదర్, సింధూర, మల్లిక, నీలం, నాటు కాయలు ఎక్కువగా సాగుశారు. పాకాల మండలంలో అత్యధికంగా తోతాపురి(బెంగళూరు రకం) సుమారుగా 6,500 టన్నులు దాకా రావచ్చని అంచనా.
నిరాశే
మామిడి రైతులు, చిరు వ్యాపారులు మామిడి పంటపై అధిక పెట్టుబడులు పెట్టారు. ఆశించిన రీతిలో పంట దిగుబడి రావడంతో లాభాలు రావచ్చని ఆశపడ్డారు. కానీ పంట కోయకనే ధరలు పతనమవ్వడంతో ఏం చేయాలో తెలియక తికమకపడుతున్నారు. కాయలు కోయకుండా తోటల్లోనే వదిలేస్తూ ధర కోసం నిరీక్షిస్తున్నారు. తోటల్లో కాయలు పండ్లుగా మాగి కుళ్లిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో దోమ కాటుతో తోటల్లోనే పండ్లు చెడిపోతున్నాయి. పంట పెట్టుబడులు, కోత కూలీలు, బాడుగలు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.
పెట్టుబడులు అధికం
మామిడి పంటలో మంచి దిగుబడికి 7 నుంచి 10 సార్లు దున్నకాలు చేపడుతారు. దున్నకాల తర్వాత పశువుల ఎరువుతో పాటు డీఏపీ, సూపర్ పాస్పేట్, వేపపిండిని కలిపి పిచికారీ చేస్తారు. ఎకరానికి రూ.30 వేలకు ఖర్చు చేస్తారు. ఇవి కాకుండా కాయల కోత సమయంలో కూలీలు, కోసిన కాయలు తరలించడానికి బాడుగలకు అదనంగా ఖర్చు చేస్తారు. అయితే ప్రస్తుతం మామిడి కాయలకు గిట్టుబాటు ధర లేకపోవడంపై తీవ్ర నష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు.
వెలవెలబోతున్న దామలచెరువు
దేశంలోనే మామిడి కాయలకు దామలచెరువు ప్రసిద్ధి. గతంలో మామిడి కాయల సీజన్‌లో దుకాణాల వద్ద రద్దీ అధికంగా ఉండేది. దామలచెరువు దిగువ గేటు నుంచి ఎగువ గేటుకు వెళ్లాలంటే సుమారు అర్ధగంట నుంచి గంట సమయం పట్టేది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. కాయలు తీసుకెళ్లేందుకు లారీలు వందల సంఖ్య వేచి ఉండేవి. అలాంటిది ఇప్పుడు మామిడికి మద్దతు ధర లేక పోవడంతో వెలవెలబోతోంది. ప్రస్తుతం పదుల సంఖ్యలో కూడా లారీలు కనిపించడం లేదు.
గిట్టుబాటు ధర కల్పించాలి
ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మామిడి కాయలకు గిట్టుబాటు ధర కల్పించడంపై రైతులతో సంప్రదించాలి. రైతుల కష్టాలను గుర్తించి పంటకు తగ్గట్టుగా గిట్టుబాటు ధర కల్పించాలి. అలాగే మామిడి జ్యూస్ ఫ్యాక్ట రీ యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాయలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలి.
– ఏ.కృష్ణయ్య, మొగరాల, పాకాల మండలం
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
ప్రభుత్వం సూచించిన ధరకు రైతుల వద్ద నుంచి మామిడి కాయలను ఎవ్వరూ కొనుగోలు చేయడం లేదు. రైతులు కోతలు జరపకుండా ఆందోళనలో ఉన్నారు. ఇక్కడ పరిస్థితులను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళతాం. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతాం.
– శైలజకుమారి, ఉద్యాన అధికారిణి, పాకాల


