ఆనాటి.. ఆ స్నేహమానందగీతం! | - | Sakshi
Sakshi News home page

ఆనాటి.. ఆ స్నేహమానందగీతం!

Jun 7 2025 1:12 AM | Updated on Jun 7 2025 1:12 AM

ఆనాటి.. ఆ స్నేహమానందగీతం!

ఆనాటి.. ఆ స్నేహమానందగీతం!

● వివాహ వేడుకల్లో చిన్ననాటి స్నేహితుల అపూర్వ కలయిక ● తలుపు తట్టిన మధురజ్ఞాపకాలు ● భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి ఆర్కే రోజా

నగరి : చిన్ననాటి స్నేహితులందరూ తమ స్నేహితురాలి కుమారుని పెళ్లిలో కలుసుకున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా స్నేహితురాలు శంకరమ్మ కుమారుడు చంద్రారెడ్డి, మోక్షితకు శుక్రవారం ఉదయం అన్నమయ్య జిల్లా పీలేరులోని ఎస్‌వీఎస్‌ఎస్‌ కల్యాణ మండపంలో వివాహమైంది. గురువారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా, భాకరాపేట పాఠశాలలో 10వ తరగతి వరకు కలసి చదువుకున్న వారంతా ఆ వివాహ వేడుకలకు హాజరయ్యారు. వీరిలో కొందరు ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. వారిలో ఒకరైన రోజా సినీ రంగంలోను, రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా స్నేహమాధుర్యం మళ్లీ వారిని బడి ఈడు పిల్లలుగా మార్చేసింది. ఆ నాటి స్నేహం ఆనంద గీతమై ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. బాధలు తెలియని నవ్వులు, మౌనం తెలియని మాటలు, కల్మషమెరుగని ప్రేమలు, కష్టం ఎరుగని క్షణాలతో గడిపిన రోజులను తలచుకొని చిన్న పిల్లలైపోయారు. చదువులమ్మ బడిలో చేసిన అల్లరిని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. మనసులో మరపురాని బాల్యపు పుటలను తిరగవేశారు. అందులో నిండిన ఆనంద క్షణాలను ఆస్వాధించారు. బడిస్నేహం వారిని కొత్త బంగారు లోకానికి తీసుకెళ్లింది. చిన్ననాటి కథలు మధుర జ్ఞాపకాల తలుపులను తెరిచాయి. ఇకపై అందరూ టచ్‌లో ఉండాలంటూ ఫోన్‌ నంబర్లు తీసుకోవడంతో పాటు మళ్లీ కలుసుకున్న తీపి క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని ఫొటోలు తీసుకుని భద్రపరుచుకున్నారు. స్నేహితులకు తమ పిల్లలను, కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను కలిసి ఆనందాలు పంచుకోవడం మరువలేని క్షణాలని, తాను ఎంతో భావేద్వాగానికి గురయ్యానని ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement