రాష్ట్ర పండుగకు పేలవంగా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పండుగకు పేలవంగా ఏర్పాట్లు

May 6 2025 1:39 AM | Updated on May 6 2025 1:39 AM

రాష్ట

రాష్ట్ర పండుగకు పేలవంగా ఏర్పాట్లు

శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతరను రాజకీయ వేదికగా మార్చేశారు. పెత్తనం చెలాయించడమే లక్ష్యంగా కూటమి నేతలు పోటీ పడుతున్నారు. రాష్ట్ర పండుగకు చేపట్టాల్సిన ఏర్పాట్లను గాలికి వదిలేసి ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. ఉత్సవ కమిటీలో స్థానం కోసం హడావుడి చేస్తున్నారు. టీడీపీ..జనసేన.. బీజేపీ నాయకుల అత్యుత్సాహంపై నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన గంగ జాతర ప్రతిష్టతో ఆటలాడుకోవడంపై మండిపడుతున్నారు. మహోత్సవం నిర్వహణ కమిటీలో నగర మేయర్‌కు స్థానం కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● కనిపించని శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఉత్సవ శోభ ● 15 మందితో కమిటీ వేసిన కలెక్టర్‌ ● కూటమి నేతలకు మాత్రమే చోటు కల్పించడంపై విమర్శలు ● మేయర్‌ శిరీష పేరు లేకపోవడంపై నగరవాసుల ఆగ్రహం ● పెత్తనం కోసం పోటీ పడుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు

తాతయ్యగుంట గంగమ్మ ఆలయం

సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి నగరంలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తాతయ్య గుంట గంగమ్మ జాతరపై నీలినీడలు అలుముకున్నాయి. జాతరకు నేడు చాటింపు ఘడియలు దగ్గరపడుతున్నా.. నగరంలో రాష్ట్ర పండుగ సందడి కనిపించడంలేదు. కూటమి ప్రభుత్వం, ఆ పార్టీల నేతలు గంగజాతర నిర్వహణ గురించి పట్టించుకోకుండా.. కమిటీలో స్థానం కోసం వెంపర్లాడుతున్నారు. ఎలాగైనా ఉత్సవ కమిటీలో చోటు దక్కించుకుని పెత్తనం చెలాయించేందుకు పోటీపడుతున్నారు. పేలవంగా ఉన్న గంగజాతర ఏర్పాట్లే ఇందుకు నిదర్శనం. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అంటే.. రాష్ట్రంలోనే ప్రత్యేకం. తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతరను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర ప్రాముఖ్యతను గుర్తించిన నాటి ప్రభుత్వం 2023లో రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. అదే ఏడాది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల స్థాయిలో గంగ జాతరను జరిపించారు. గతంలో చాటింపునకు కొద్ది రోజుల ముందు నుంచే తిరుపతిలో జాతర సందడి కనిపించేది. నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే ఒత్తిడి

ఎమ్మెల్యే ఆరణి పంపిన ఉత్సవ కమిటీ సిఫారసు లేఖకు చెక్‌పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఎవరినీ సంప్రదించకుండా ఏక పక్షంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వారి అనుచరుల పేర్లు పంపితే ఎలా కుదురుతుంది? అని ఆ కమిటీకి ఆమోదం తెలుపకుండా పక్కన పడేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాను పంపిన లేఖకు విలువలేకుండా పోవడంతో ఎమ్మెల్యే ఆరణి వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎలాగైనా ఆ కమిటీని ప్రకటించాలని ఎమ్మెల్యే ఆరణి తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. కలెక్టర్‌ కమిటీని ప్రకటించిన తర్వాత దేవదాయశాఖ మరో కమిటీని ప్రకటిస్తే తేడాలొస్తాయని అసిస్టెంట్‌ కమిషనర్‌ డైలమాలో పడ్డట్టు సమాచారం. ఎమ్మెల్యే ఒత్తిడితో కమిటీని ప్రకటిస్తే.. కలెక్టర్‌కి విలువ ఉండదు కదా? అని దేవదాయశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కూటమి నేతలు తమ కుమ్ములాటలతో రాష్ట్ర పండుగ అయిన తాతయ్యగుంట గంగజాతరను అభాసుపాలు చేస్తున్నారని నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.

సందట్లో సడేమియా!

కలెక్టర్‌ వేసిన కమిటీపైనే విమర్శలు వెల్లువెత్తుతుంటే.. సందట్లో సడేమియా అంటూ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు 27 మందితో మరో కమిటీని ప్రతిపాదిస్తూ దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. అందులో 11 మంది ఎమ్మెల్యే ఆరణి వర్గీయులు, మరో 12 మంది మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వర్గీయులు. ఇందులో 11 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఎమ్మెల్యే సిఫారసు లేఖలోని పేర్లను తెలుసుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరినీ సంప్రదించకుండా ఎవరికి వారు పేర్లు పంపడంపై మండిపడుతున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

రాష్ట్ర పండుగకు పేలవంగా ఏర్పాట్లు 
1
1/1

రాష్ట్ర పండుగకు పేలవంగా ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement