
కొనసాగుతున్న సమ్మె
తిరుపతి తుడా : న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం ముందు సీహెచ్‌ఓలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా సోమవారం సుమారు 200 మందికి పైగా సీహెచ్‌ఓలు నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పలువురు సీహెచ్‌ఓలు మీడియాతో మాట్లాడుతూ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, ఎన్‌హెచ్‌యూ ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని విజ్ఞప్తి చేశారు.