
నీటి సంపునకూ పసుపు రంగులా..?
తిరుపతి రూరల్: దామినేడులోని ఇందిరమ్మ ఇళ్లకు కూడా పసుపు రంగులు వేశారు. దీనిపై ఆగ్రహించిన తిరుపతి రూరల్ మండల ప్రజాప్రతినిధులు సోమవారం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించారు. వేదాంత పురం వద్ద ఆరు పంచాయతీల్లో తాగునీటి సమస్య తీర్చడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీలు విడుదల మాధవ రెడ్డి, యశోద తిరుపతి మున్సిపాల్టీ ఆధీనంలో నిరుపయోగంగా ఉన్న అండర్ గ్రౌండ్ సంపును తమకు అప్పగించాలని ప్రతిపాదించారు. ఎంపీడీఓ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేయించి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు పంపించారు. ఆపై జిల్లా పరిషత్ సమావేశంలో దీనిపై చర్చించి జెడ్పీ నుంచి సంపు మరమ్మతులకు సరిపడా నిధులు తెప్పించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ సంపును అందుబాటులోకి తెస్తే ఆరు గ్రామ పంచాయతీలకు నీటి సమస్య తీరుతుందని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి తెచ్చి తాను ఒక్కరే సాధించి తెచ్చినట్టుగా పసుపు రంగులు వేయించారు. సోమవారం సంపు ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. మొదటి నుంచి కష్టపడ్డ వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ మాధవరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు సోమవారం సంపు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించారు. ప్రభుత్వ నిధులతో కట్టించిన సంపునకు పార్టీ రంగులు ఎలా వేస్తారంటూ స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
సత్యవేడు టీడీపీలో లుకలుకలు!
సాక్షి టాస్క్‌ఫోర్స్:సత్యవేడు నియోజకవర్గ టీడీపీలో మరో మారు అసమ్మతి వర్గం గొంతు విప్పుతోంది. ఈనెల 7న సత్యవేడులో మంత్రి లోకేష్ పర్యటించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గీయుల కనుసన్నల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై ఎమ్మెలే ఆదిమూలం వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎన్నికల్లో గెలిచిన మూడు నెలలకే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోల కారణంగా ఆయన ప్రతిష్ట మసకబారింది. అదే సమయంలో ఆయనపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఇదే అదునుగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఆధిపత్యం చెలాయించేందుకు రంగంలో దిగింది.
ఏర్పాట్లలో అసమ్మతి నేతలు
సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున పరిశీలకుడిగా ప్రవేశించిన చంద్రశేఖర్ నాయుడు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌గా చలామణి అవుతున్న శ్రీపతి బాబు ఆధ్వర్యంలో అసమ్మతి నేతలు రెండు రోజులుగా మంత్రి లోకేష్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అధికారుల సైతం వీరి డైరెక్షన్‌లోనే ముందుకు వెళుతున్నారు. దీంతో ఇన్నాళ్లు నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు ఎమ్మెల్యేని కాదని చేసేందుకు వీలేదంటూ హుకుం జారీ చేసిన వారికి దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. ఇవన్నీ గమనిస్తున్న టీడీపీ కేడర్ మాత్రం ఈ పరిణా మాలు ఎక్కడకు దారితీస్తాయో అంటూ ఆందోళన చెందుతుండడం గమనార్హం.

నీటి సంపునకూ పసుపు రంగులా..?