
భూ ఆక్రమణలపై ముమ్మర దర్యాప్తు
● రెవెన్యూ, అటవీశాఖ భూ రికార్డుల తనిఖీ ● రెవెన్యూ, అటవీశాఖ అధికారులను ఆదేశాలు ● బసవాయిగుంట, పూలరంగడుపల్లెలో పర్యటించిన సబ్‌కలెక్టర్ ● సాక్షి దినపత్రికలోని కథనాన్ని తహసీల్దార్‌తో చదివించిన సబ్‌కలెక్టర్
వెంకటగిరి రూరల్: అటవీ భూముల ఆక్రమణపై సబ్‌కలెక్టర్ సీరియస్ అయ్యారు. భూ ఆక్రమణలపై దర్యాప్తు చేపట్టారు. గ్రామసభలు నిర్వహించి నివేదికను సమర్పించాలని అటవీ, రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలంలోని పూలరంగడుపల్లి, బసవాయిగుంట ప్రాంతాల్లో ఉన్న అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయని సాక్షి దినపత్రికలో శ్రీఆటవిక రాజ్యంశ్రీ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీన మంగళవారం వెంకటగిరికి చేరుకుని తహసీల్దార్ రాంబాబు, అటవీశాఖ అధికారులతో కలిసి భూ ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించారు. సాక్షి దినపత్రికలో వచ్చిన ఫొటోలు ఏ ప్రాంతంలో ఉన్నాయో తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. సాక్షి దినపత్రిలో ప్రచురితమైన కథనాన్ని చదివి వినిపించాలని తహసీల్దార్ రాంబాబుని ఆదేశించారు. ఆ కథనాన్ని తహసీల్దార్ చదివారు. ఈ మేరకు భూ ఆక్రమణలు ఎంత మేర జరిగాయి.. రెవెన్యూ, అటవీశాఖలకు సంబంధించిన భూమి ఎంత ఉండాలన్న అంశంపై అధికారులను అడిగి రికార్డులు పరిశీలించారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు కలిసి ఆయా గ్రామాల్లో పర్యటించి రికార్డుల ఆధారంగా తనిఖీ చేపట్టాలని ఆదేశించారు. అలాగే గ్రామసభల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని తహసీల్దార్ రాంబాబు, డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ విజయ్‌కుమార్‌ను ఆదేశించారు. సర్వేయర్ సుప్రజ, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి పేట, చిన్నగొట్లగుంట, పెద్ద గొట్టగుంట ప్రాంతాల్లో రాఘవేంద్ర మీన పర్యటించి, భూవివాదాలపై చర్చించారు.
రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం
బసవాయిగుంట సర్వే నంబర్ 74లో ఆక్రమణలు జరిగాయని సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఆ భూములు సాగు చేసుకుంటున్న రైతులు వద్ద టెన్‌వన్ అడంగల్, ఢీ పట్టాలు పరిశీలించి అధికారులకు ఆదేశించాం. ఈ ప్రాంతంలో కొంత మేర సీజేఎఫ్‌ఎస్ భూములు కూడా ఉన్నాయి. రికార్డులను పరిశీలించిన తరువాత తగు చర్యలు తీసుకుంటాం. –రాఘవేంద్రమీన, సబ్ కలెక్టర్ గూడూరు

భూ ఆక్రమణలపై ముమ్మర దర్యాప్తు