కుప్పంరూరల్: స్నేహితులతో కలిసి సరదాగా తెప్పపై చెరువులో విహారానికి వెళ్లి, గల్లంతైన సామగుట్టపల్లెకు చెందిన సంజయ్ (27) మృతదేహం సోమవారం లభ్యమైంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు యంత్రాంగం రెండు రోజులుగా సంజయ్ మృతదేహం కోసం తీవ్రంగా గాలించారు. ఫలితం లేకపోయింది. అయితే సోమవారం అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక గాలి యంత్రాలతో చెరువు నీటిలోకి గాలిని పంపి, వెతుకులాట ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు మృతుడు సంజయ్ శవం పైకి తేలింది. మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా మృతుడు సంజయ్ అవివాహితుడు. స్నేహితులే సంజయ్‌ని హతమార్చి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కుప్పం సీఐ శ్రీధర్ తెలిపారు. మృతదేహం వెలికి తీతలో ఫైర్ సిబ్బంది ప్రవీణ్‌కుమార్, నరేష్, రామమూర్తి, కృష్ణయ్య, మణి, బాలకృష్ణ పాల్గొన్నారు.