అద్భుతంగా నెమలిపింఛ వినాయకుడు | - | Sakshi
Sakshi News home page

అద్భుతంగా నెమలిపింఛ వినాయకుడు

Sep 23 2023 12:54 AM | Updated on Sep 23 2023 12:54 AM

- - Sakshi

● స్వామి సన్నిథిలో ఇస్కాన్‌ అంతర్జాతీయ అధ్యక్షుడు● పూర్ణకుంభ స్వాగతం పలికిన ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి

తిరుపతి రూరల్‌: ఇస్కాన్‌ అంతర్జాతీయ అధ్యక్షుడు రేవతీ రమణదాస్‌ దంపతులు శుక్రవారం నెమలిపింఛ వినాయకున్ని దర్శించుకున్నారు. కల్యాణ వెంకన్న ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంట గ్రామంలో జరిగే శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు హాజరయ్యారు. అంతకుముందు స్వామి వారికి సారె సమర్పించారు. ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నెమలిపింఛ వినాయక విగ్రహాన్ని దర్శించారు. విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు.

నేటి నుంచి సైన్స్‌ సెంటర్‌ వార్షికోత్సవాలు

తిరుపతి కల్చరల్‌: రీజనల్‌ సైన్స్‌ సెంటర్‌ 30వ వార్షికోత్సవాన్ని శనివారం నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు సైన్స్‌ సెంటర్‌ ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాస నెహ్రూ ఒక ప్రకటనలో తెలిపారు. 1993 సెప్టంబర్‌ 23న సైన్స్‌ సెంటర్‌ ప్రారంభమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం పునరుద్ధరించిన హెర్బల్‌ గార్డెన్‌తో పాటు కేంద్రం ఒక వార్షికోత్సవ పోస్టల్‌ స్టాంప్‌, సైన్స్‌ క్విజ్‌ పోటీని, కొత్త సైన్స్‌ షోను విద్యార్థుల కోసం ప్రారంభించనున్నట్లు తెలిపారు. శనివారం హెర్బల్‌ గార్డెన్‌ ప్రారంభోత్సవం, ఆర్‌ఎస్‌సీ తిరుపతి వార్షికోత్సవ స్టాంప్‌ విడుదల, 24న సాయంత్రం 4 గంటలకు సైన్స్‌ షో, 25న ఉదయంసందర్శకుడికి రివార్డ్‌, 26న మధ్యాహ్నం 2 గంటలకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అనే అంశంపై ఇంటర్‌ స్కూల్‌ టీమ్‌వైజ్‌ సైన్స్‌ క్విజ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే 27న మధ్యాహ్నం 2 గంటలకు ఓపెన్‌ హౌస్‌ సైన్స్‌ క్విజ్‌ పోటీ, అదే రోజు 3 గంటలకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు.

ఆర్టీసీ బస్సులకే అనుమతి

తిరుపతి అర్బన్‌: శ్రీనివాస సేతు బ్రిడ్జి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌లోకి ఏర్పాటుచేసిన మార్గంలో ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతి ఉందని జిల్లా ప్రజా రవాణా అధికారి చెంగల్‌రెడ్డి తెలిపారు. ద్విచక్ర, మూడు, నాలుగు చక్రాల వాహనాలు వస్తుండడంతో ఆర్టీసీ సర్వీసులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో అన్ని వాహనాలు శ్రీనివాస సేతుపై వెళ్లడానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

25న హ్యాండ్‌ బాల్‌ పోటీలకు జట్ల ఎంపిక

బుచ్చినాయుడుకండ్రిగ: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల 25న రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు జట్లు ఎంపిక చేయనున్నట్టు హెచ్‌ఎం రమణయ్య తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల నుంచి 400 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటారని, వీరిని 50 మందిని ఎంపిక చేస్తారన్నారు. ఎంపికై న వారు ఈనెల 29వ తేదీన తెనాలిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని ఆయన వివరించారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం, కరాపేటలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. భాకరాపేట ఇన్చార్జి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం.. భాకరాపేట టీచర్స్‌ కాలనీకి చెందిన సాకిరి నారాయణమ్మ (80) గురువారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికులు భాకరాపేట పోలీసులుకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. మృతురాలి భర్త, కుమారుడు కొన్నాళ్ల క్రితం చనిపోయారు. మృతురాలి శరీరంపై ఉన్న బంగారు నగలు కనిపించడం లేదని ఆమె కుమార్తె నాగరాజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

బైక్‌ను ఢీకొన్న కారు

– ఇద్దరికి గాయాలు

నాయుడుపేట టౌన్‌: మండలంలోని నరసారెడ్డికండ్రిగ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం బైక్‌ను కారు ఢీకొ న్న ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం.. పట్టణంలోని జైహింద్‌ కాలనీకి చెందిన బేల్దారి కార్మికుడు పోట్లూరు రంగారావు, మరో కార్మికురాలు శ్రీవాణి బైక్‌లో నరసారెడ్డికండ్రిగ జాతీయ రహదారి కూడలి వద్ద రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో చైన్నె నుంచి గూడూరు వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న రంగారావు, శ్రీవాణికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ కృష్ణయ్య ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు దర్యాప్తులో ఉంది.

ట్రక్‌ బోల్తా : డ్రైవర్‌కు గాయాలు

రాపూరు : మండలంలోని బొజ్జనపల్లె వద్ద శుక్రవారం కల్వర్ట్‌ ఢీకొని ట్రక్‌ బోల్తా పడడంతో డ్రైవర్‌ గాయపడ్డాడు. నెల్లూరు రామకోటయ్యనగర్‌కు చెందిన నాగేశ్వర్‌రెడ్డి ట్రక్‌లో అద్దెకు బెంగళూరుకు వెళ్లి వస్తుండగా అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ట్రక్‌ ధ్వంసం కాగా నాగేశ్వరరెడ్డికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని రాపూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

నారాయణమ్మ మృత దేహం వద్ద క్లూస్‌ టీమ్‌1
1/5

నారాయణమ్మ మృత దేహం వద్ద క్లూస్‌ టీమ్‌

బస్టాండ్‌ వైపునకు దిగుతున్న  ఇతర వాహనాలు2
2/5

బస్టాండ్‌ వైపునకు దిగుతున్న ఇతర వాహనాలు

3
3/5

ప్రమాదంలో గాయపడ్డ శ్రీవాణి, రంగారావు 
4
4/5

ప్రమాదంలో గాయపడ్డ శ్రీవాణి, రంగారావు

రమణయ్య 
ప్రధానోపాధ్యాయులు 5
5/5

రమణయ్య ప్రధానోపాధ్యాయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement