
● టీచర్ల ట్రాన్స్‌ఫర్లకు ఉత్తర్వులు ● కసరత్తు వేగవంతం చ
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల బదిలీలకు రాష్ట్ర విద్యాశాఖ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బదిలీల ప్రక్రియపై విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు ఈనెల 21న డీఈఓలకు వెబెక్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ వెబెక్స్‌లో జిల్లా నుంచి డీఈఓ వరలక్ష్మి, ఏడీలు సుకుమార్, వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన చేపట్టే ఈ బదిలీలకు బుధవారం ట్రానన్స్‌ఫర్ పోర్టల్ ప్రారంభం అయింది. ఈ ప్రక్రియ జూన్ 5 నాటికి పూర్తి చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, ఎస్‌ఏలకు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టనుండగా, ఎస్జీటీలకు మాన్యువల్‌గా బదిలీల ప్రక్రియ నిర్వహించనున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో..
టీచర్ల బదిలీల కసరత్తు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధి లో నిర్వహిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4916 పాఠశాలలున్నాయి. వీటిలో 3766 ప్రాథమిక, 445 ప్రాథమికోన్నత, 705 ఉన్నత పాఠశాలలు.17,372 మంది టీచర్లకు గాను 15,454 పనిచేస్తున్నారు. 37 విభాగాల్లో 1918 పోస్టులను క్లియర్ వేకెన్సీలుగా చూపించగా, మరో 5082 ఖాళీలుగా చూపించారు. ఒకే పాఠశాలలో ఐదేళ్లు పూర్తి చేసిన హెచ్‌ఎంలు, 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లు తప్పనిసరిగా బదిలీ కానున్న నేపథ్యంలో 5/8 ఏళ్లు ఒకే చోట పనిచేసిన టీచర్ల ఖాళీలు 3 వేలు చూపగా, మిగులు కింద 500, స్కూల్ కొత్త పోస్టు లు (రీఅపోర్షన్), ఒక యాజమాన్య పాఠశాల నుంచి మరో యాజమాన్య పాఠశాలల్లో నెలకొన్న(షిఫ్టెడ్) ఖాళీలు 1582 చూపుతున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖాళీల వివరాలు
యాజమాన్యం ఖాళీలు
ప్రభుత్వ 125
ఎంపీపీ/జెడ్పీ 1583
మున్సిపల్ కార్పొరేషన్ 135
మున్సిపల్ 75
5/8 ఏళ్లు ఒకేచోట పనిచేసిన టీచర్లు 3000
మిగులు పోస్టులు 500
రీ అపోర్షన్/ షిఫ్టెడ్ 1582
మొత్తం 7000
హడావుడిగా దరఖాస్తు చేసుకోవాలని..
బదిలీ ఉత్తర్వులు విడుదలయ్యాయో లేదో అప్పుడే హడావుడిగా పలు కేడర్‌ల టీచర్లు ఆన్‌లైన్‌లో దరఖా స్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పలు కేడర్‌ల టీచర్ల గందరగోళానికి లోనయ్యారు. కూటమి సర్కారు చేపడుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరుకు 5 సంవత్సరాలు ఒకేచోట పనిచేసిన హెచ్‌ఎంలు గురువారం సాయంత్రం 5గంటల్లోపు బదిలీ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిఫరెన్షియల్ కేటగిరిలోని టీచర్లు మెడికల్ బోర్డు వెరిఫికేషన్‌కు బుధవారంతో గడువు పూర్తి కానుంది. బదిలీల్లోని సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపడుతున్నారు.
బదిలీల షెడ్యూల్ ఇలా..
ప్రక్రియ హెచ్‌ఎం స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ
బదిలీలకు దరఖాస్తులు ఈనెల 21, 22 ఈనెల 21 నుంచి 24 ఈ నెల 21 నుంచి 27
పరిశీలన ఈనెల 21,22 ఈ నెల 21 నుంచి 25 ఈనెల 21 నుంచి 28
ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా 24 26,27 31
గ్రీవెన్సెస్ 25 28 28 నుంచి జూన్ 1
గ్రీవెన్సెస్ పరిష్కారం 26 28, 29 28 నుంచి జూన్ 2
తుది సీనియారిటీ జాబితా 27 31 జూన్ 6
వెబ్ ఆప్షన్స్ 28 జూన్ 1, 2 జూన్ 7 నుంచి 10
బదిలీ ఉత్తర్వులు 30 జూన్ 4 జూన్ 11
ఉద్యోగోన్నతులు మే 30 (ఎస్‌ఏ నుంచి హెచ్‌ఎం) జూన్ 5 (ఎస్జీటీ నుంచి ఎస్‌ఏ)
ఉద్యోగోన్నతులు ఉత్తర్వులు మే 31 జూన్ 6
పకడ్బందీగా చేపడతాం
బదిలీల కసరత్తు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. బదిలీలు నిబంధనల మేరకు చేపడుతాం. ఇందులో ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదు. టీచర్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. తప్పులు లేకుండా దరఖాస్తు చేసుకోవాలి. బదిలీల విషయంలో దళారుల మాటలు నమ్మకూడదు. ఎవరైనా మోసాలకు పాల్పడితే శాఖాపరంగా చర్యలు కఠినంగా ఉంటాయి. – కేవీఎన్ కుమార్, డీఈఓ