
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
చంద్రగిరి : మండలంలోని ముండ్లపూడి వద్ద బుధవారం ఉదయం ఓ అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచారూరు పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కుమార్‌రాజా అనే వ్యక్తి ఇంట్లో ఈ నెల 1వ తేదీన చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన నాగరాజ అలియాస్ వాసును అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవం వెల్లడైంది. నిందితుడి నుంచి 168.55 గ్రాముల బంగారు, 192.5 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కర్ణాటకలోని పలు పోలీస్‌స్టేషన్లలో దోపిడీ, చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. కేసును ఛేదించిన సీఐ సునీల్‌కుమార్, ఎస్‌ఐలు అరుణ, సాయినాథ్ చౌదరి, జగన్నాఽథరెడ్డి, సిబ్బంది ప్రసాద్, ప్రభాకర్‌ను ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
తిరుపతి సిటీ : దైనందిన జీవితంలో యోగాను భాగంగా మార్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో యోగా మాసోత్సవాలను ప్రారంభించారు. తొలిరోజు ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో కలసి ఆయన యోగాసనాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ మట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా కర్టన్ రైజర్ యోగాంధ్రా–2025కు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు.ఈ క్రమంలోనే ఈ నెల 21 నుంచి జూన్ 21వ వరకు యోగా మాసంగా ప్రభుత్వం ప్రకటించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే ఆరణి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి రోజుకు కనీసం గంటపాటు యోగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. యోగాడేలో ప్రజలు భాగస్వాములై విజయవంత చేయాలని పిలుపునిచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ సామూహిక యోగాలో పెద్దసంఖ్యలో జనం పాల్గొని రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేయాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ, రిజిస్ట్రార్ రజని, డీఆర్‌ఓ నరసింహులు , ఆర్‌డీఓ రామ్మోహన్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.