
కొత్త ట్రస్ట్ ఏర్పాటుపై పరిశీలించాలి
తిరుపతి తుడా: శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవల దృష్ట్యా టీటీడీలో కొత్తగా ఓ ట్రస్ట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం చిన్నపిల్లల హృదయాలయాన్ని పరిశీలించారు. చిన్న పిల్లల ఐసీయూ బ్లాక్, జనరల్ వార్డు, ఓపి బ్లాక్ లోని పిల్లలకు అందుతున్న వైద్యసేవలపై వైద్యులను, పిల్లల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఇప్పటికే శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయం స్కీం ఉందని తెలిపారు. దీని కింద దాత రూ.లక్ష విరాళం ఇస్తే నిరాదరణకు గురైన పేద పిల్లలకు ఉచితంగా ఆపరేషన్ చేసే సదుపాయం ఉందన్నారు. టీటీడీలో ఇప్పటికే ఉన్న పలు ట్రస్టుల తరహాలో నూతనంగా చిన్నపిల్లల వైద్య సేవల కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుకు నియమ నిబంధనలపై నివేదిక తయారు చేయాలని సూచించారు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే పసి బిడ్డలకు చక్కటి వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. పిల్లలకు సంబంధించి గుండె చికిత్సలతో పాటు చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల సంఖ్యను పెంచేందుకు అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆయన నూతన భవన నిర్మాణంపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ, ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్ భరత్, ఎస్‌ఈలు వేంకటేశ్వర్లు, మనోహరం పాల్గొన్నారు.