
ప్రభుత్వ భూమి కబ్జా
ఏర్పేడు : మండలంలోని పెనుమల్లం సమీపంలో రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ స్థానిక నేతలు కబ్జా చేసేశారు. వివరాలు.. గ్రామంలోని ఇరగలప్పచలం ఆలయానికి వెళ్లే మార్గంలో సర్వే నంబర్ 183లో 3.92 ఎకరాలు, సర్వే నంబర్ 182–1లో 4.40 ఎకరాల చిట్టేటి గుంట పోరంబోకు భూమి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి చెందిన బొజ్జ శంకరయ్య, పెరుమాళ్ అనే వ్యక్తులు సదరు భూమిని ఆక్రమించేశారు. బొజ్జా శంకరయ్య ఏకంగా ఇల్లు నిర్మిస్తున్నాడు. మిగిలిన స్థలాన్ని జేసీబీతో చదును చేయించేశాడు. ఈ ప్రాంతంలో ఎకరా రూ.50 లక్షలు వరకు ధర పలుకుతోంది. ఆక్రమణపై స్థానికులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
పాలమంగళం విద్యార్థికి అవార్డు
నారాయణవనం: పాలమంగళం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి ఆశిష్‌కు షైనింగ్ స్టార్ అవార్డు దక్కింది. విభిన్న ప్రతిభావంతుడైన ఆశిష్ 500 మార్కులకు గాను 481 సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానం, జిల్లా టాపర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మంగళగిరిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా అవార్డు అందుకున్నాడు. బుధవారం ఈ మేరకు పాఠశాల హెచ్‌ఎం మనోహరి మాట్లాడుతూ ఆశిష్ మనోధైర్యంతో అంగ వైకల్యం జయించాడని ప్రశంసించారు.
రోడ్డు ప్రమాదంలో జింక మృతి
తిరుమల: తిరుమలలోని రింగ్ రోడ్డులో ప్రమాద వశాత్తు జింక మృతి చెందింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. తిరుమలలోని గ్యాస్ గోడౌన్ సమీపం రింగ్ రోడ్లో రోడ్డు దాటుతున్న జింకను గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో జింక అక్కడికక్కడే మృతిచెందింది. ఫారెస్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని జింక కళేబరాన్ని తిరుపతిలోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు.
మసూర బియ్యం పేరుతో టోకరా
రేణిగుంట: మండలంలోని గాజులమండ్యం దళితవాడలో బుధవారం ఇద్దరు వ్యక్తులు మసూర బియ్యం పేరుతో స్థానికులకు టోకరా పెట్టారు. ఇద్దరు వ్యక్తులు గ్రామంలోకి స్కూటర్లపై బియ్యం బస్తాలను వేసుకొచ్చారు. ఒక్కో బస్తా రూ.వెయ్యి చొప్పున విక్రయించి వెళ్లారు. తీరా మూట విప్పి చూస్తే అవి రేషన్ బియ్యం కావడంతో స్థానికులు అవాక్కయ్యారు. రెండు నెలల క్రితం కూడా వెంకటాపురం పంచాయతీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. అయితే దీనిపై స్థానిక పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

ప్రభుత్వ భూమి కబ్జా

ప్రభుత్వ భూమి కబ్జా

ప్రభుత్వ భూమి కబ్జా