Omicron Variant: తీవ్రతపై త్వరలో స్పష్టత!

Yashoda Hospital Chief Interventional Pulmonologist Hari Kishan Reacts On Omicron - Sakshi

ఒమిక్రాన్‌పై యశోద ఆస్పత్రి చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ హరికిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా డెల్టా వేరియెంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ 4.2 రెట్లు అధికంగా సోకే అవకాశాలున్నాయని జపాన్‌ క్యోటో వర్సిటీ అధ్యయనంలో వెల్లడి కావడం అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. రోగనిరోధక శక్తినీ ఒమిక్రాన్‌ తప్పించుకునే అవకాశాలు ఎక్కువని తేలడంతో దాని లక్షణాలు, ప్రభావాలు, తీవ్రత, వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి.

ఈవేరియెంట్‌ నుంచి తమ బూస్టర్‌ డోస్‌తో రక్షణ పెరుగుతుందని ఫైజర్, బయో ఎన్‌టెక్‌ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాధాన్యతా అంశాలను యశోద ఆçస్పత్రి చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ హరికిషన్‌ గోనుగుంట్ల ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 

ఆర్టీపీసీఆర్‌కు చిక్కకుంటే ఒమిక్రానే! 
కరోనా డెల్టా కేసులకు బూస్టర్‌ డోస్‌లతో 90 శాతం మరణాలు నిరోధించినట్టు న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (ఎన్‌ఈజేఎం) తాజా అధ్యయనం వెల్లడించింది. దీన్ని బట్టి ఒమిక్రాన్‌ పైనా బూస్టర్‌ డోస్‌లు ప్రభావం చూపుతాయి. దేశంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు అందరికన్నా ముందు రెండు డోసుల టీకాలిచ్చాం.

హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఇతర హైరిస్క్‌ జనాభాకు వెంటనే థర్డ్‌/బూస్టర్‌ డోస్‌లు వేసేందుకు అనుమతినిస్తే మంచిది. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లతోనే పరీక్షల్లో ఎస్‌ జీన్‌ కనిపించకపోతే ఒమిక్రాన్‌గా భావించాలి. ఇప్పుడున్న టీకాలు ఒమిక్రాన్‌పైనా బాగానే పనిచేస్తాయి. సాధారణ ఫ్లూ మాదిరి ఇది వెళ్లిపోయే అవకాశాలున్నందున అనవసర ఆందోళన వద్దు. 

ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రాదు
దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరిగినా ఆందోళన  వద్దు. కొత్త వేరియెంట్‌ బాధితులను ఆసుపత్రుల్లో చేర్చాల్సిన అవసరం ఉండదు. ఈ వేరియెంట్‌ తీవ్రమైన వ్యాధిగా మారే ప్రమాదముందా? ఇది ఏ మేరకు ఆందోళనకరమో  వచ్చే 3 వారాల్లో తెలియనుంది. వచ్చే నెలా, రెండు నెలలు  పెళ్లిళ్లు, ఫంక్షన్లలో గుమిగూడొ ద్దు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ లను జాగ్రత్తగా బాధ్యతతో చేసుకోవాలి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top