Viveka Case: Hearings Completed On MP Avinash Reddy's Petition - Sakshi
Sakshi News home page

తీర్పు వచ్చేవరకు ఎంపీ అవినాష్‌ రెడ్డిపై ఎలాంటి చర్యలొద్దు

Published Mon, Mar 13 2023 2:44 PM

Viveka Case: No action on MP Avinash Reddy till the HC orders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు విన్న అనంతరం అరెస్టు సహా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తాము తీర్పు వెలువరించే వరకు ఈ మధ్యంతర ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. తనను విచారణకు హాజరు కావాలని ఆదేశించడంపై స్టే విధించాలని కోరుతూ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఒకవేళ విచారణ చేపట్టినా ఆడియో, వీడియో రికార్డింగ్‌తోపాటు దర్యాప్తు పారదర్శకంగా సాగేలా సీబీఐని ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిష న్‌పై న్యాయ­మూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌పైనా తీర్పు రిజర్వు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.

(చదవండి : రెండో వివాహంతోనే కుటుంబంలో తీవ్ర విభేదాలు)

రాజకీయ ఒత్తిళ్లతోనే అభియోగాలు..
‘సునీత పిటిషన్‌ వెనుక సీబీఐ హస్తం ఉంది. కొందరు రాజకీయ నేతల ఒత్తిళ్లతోనే ఆమె పిటిషనర్‌పై అభియోగాలు మోపారు. తన తండ్రి పిటిషనర్‌ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారని, ఇంటింటికి తిరిగారని హత్య జరిగిన అనంతరం కూడా చెప్పిన సునీత ఏడాది తర్వాత మాట మార్చారు. ఆ తర్వాత నుంచి పిటిషనర్‌పై ఆరోపణలు చేయడం ప్రారంభించారు. వివేకా హత్య కేసులో అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, హతుడి రెండో భార్య షమీమ్‌ పాత్రపై సీబీఐ విచారణ సాగించడం లేదు. వివేకా 2010లో రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు జన్మించాడు. రెండో పెళ్లి కారణంగానే వివేకా కుటుంబంలో విభేదాలు వచ్చాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో మనస్ఫర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలో తన పేరుతో ఉన్న ఆస్తులను రెండో భార్య పేరుతో రాయాలని వివేకా భావించారు. ఆస్తుల గొడవల వల్లే వివేకా హత్య జరిగింది. ఈ కేసులో రెండో పెళ్లి కూడా కీలక అంశం. సీబీఐ ఆ దిశగా విచారణ చేయాలి. వివేకాది గుండెపోటని పిటిషనర్‌ ఎక్కడా చెప్పలేదు. స్థానిక రాజకీయ నేత శశికళతో పిటిషనర్‌ అసలు మాట్లాడనే లేదు. ఆమె కూడా ఇదే విషయాన్ని సీబీఐకి చెప్పింది. ఇదే కోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. అందులో శశికళ గురించి కూడా ప్రస్తావించారు. ఇప్పటివరకు సీబీఐ రెండు చార్జీషీట్లు దాఖలు చేసినా ఎక్కడా సిట్‌ దర్యాప్తు నివేదికను కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో 14న సీబీఐ విచారణకు పిటిషనర్‌ హాజరుకాకుండా ఆదేశాలి­వ్వా­లి’ అని నిరంజన్‌­రెడ్డి కోరారు. 

(చదవండి : వివేక హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు?)

సీల్డ్‌ కవర్‌లో వివరాలు...
వివేకా హత్య కేసు డైరీని సీబీఐ సీల్డ్‌ కవర్‌లో హైకో­ర్టుకు సమర్పించింది. 35 మంది సాక్షుల వాంగ్మూ­లం, 10 డాక్యుమెంట్లు, కొన్ని ఫొటోలు, హార్డ్‌డిస్క్‌­లను కోర్టు ముందుంచింది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖ, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికను సైతం సమర్పించింది. కేసుకు సంబంధించి ఆధారాలను ధ్వంసం చేసినట్లు పిటిషనర్‌పై ఆరోపణలున్నా­యని, ఆయనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయవద్దని కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ కార్యాలయం ఎదుట  మీడియాకు వివరా­లను ఎంపీ వెల్లడించడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. ఈనెల 14న విచారణ హాజరు నుంచి మినహాయింపు కోరే అంశంపై సీబీఐనే ఆశ్రయించాలంది. ఈ కేసు విచారణ హైదరా­బాద్‌కు బదిలీ అయ్యాక పిటిషనర్‌ తండ్రి భాస్కర్‌రెడ్డిని కడపలో హాజరు కావాలని ఎందుకు పిలిచారని సీబీఐని ప్రశ్నించింది. తాము పిలవలేదని సీబీఐ తెలిపింది. కాగా తన మీద, తన కుటుంబంపైనా ఆరోపణలు చేశారని అందుకే ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశానని సునీత నివేదించారు. 

Advertisement
Advertisement