కరోనా వేగం తగ్గాలంటే టీకా వేగం పెరగాల్సిందే! 

Vaccination Speed Must Increase If Corona Speed Is To Decrease - Sakshi

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య 

మూక నిరోధకత రావాలంటే భారీగా టీకాలు వేయాల్సిందే.. 

ఇప్పటివరకు 10 శాతం జనాభాకే వ్యాక్సినేషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనాపై యుద్ధం ఊపందుకుంటోంది. పలు రాష్ట్రాలు, నగరాల్లో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. మరోవైపు రోజుకు సగటున 30 లక్షల మందికి టీకాలిస్తున్నారు. అయితే రెండు వ్యాక్సిన్లతో మూక నిరోధకతకు ఎంత సమయం పడుతుంది? అందరికీ రెండు డోసుల టీకాలిచ్చేందుకు సరిపడా ఉత్పత్తి చేస్తున్నామా? కరోనా మహమ్మారి గురించి పలువురి మదిలో మెదిలే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.. ఏప్రిల్‌ 16 నాటికి దేశం మొత్తమ్మీద వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి సంఖ్య 11.72 కోట్లకు చేరుకుంది.

సుమారు 130 కోట్ల జనాభాలో ఇది దాదాపు 10 శాతం. వీరిలో 10 కోట్ల మంది మొదటి డోస్‌ తీసుకోగా, మిగిలిన 1.72 కోట్ల మంది మాత్రమే సెకండ్‌ డోస్‌ తీసుకున్నారు. అంటే దాదాపు ఒక్క శాతం మంది జనాభాకు మాత్రమే కరోనా నుంచి రక్షణ ఉందన్నమాట. ప్రతి ఐదుగురి లో ముగ్గురు టీకా ద్వారా రక్షణ పొందగలిగితేనే మూక నిరోధకత సాధ్యమన్న నిపుణుల మాటను పరిగణనలోకి తీసుకుంటే.. టీకా వేగం గణనీయంగా పెరగాల్సిన అవసరముంది. ఇది జరగాలంటే వ్యాక్సిన్‌ ఉత్పత్తి రేటు ఎక్కువ కావాలి. భార త్‌ బయోటెక్, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల ఉమ్మడి ఉత్ప త్తి సామర్థ్యం నెలకు గరిష్టంగా 11.3 కోట్లు మాత్ర మే. అంటే రోజుకు 38 లక్షల టీకాలన్న మాట. 

60 శాతం టీకాలకు ఏడాది? 
కరోనా నుంచి రక్షణ కల్పించే మూక నిరోధకత సాధించేందుకు దేశీయంగా టీకా కార్యక్రమం వచ్చే ఏడాది మే నెల వరకూ జరగాల్సి ఉంటుంది. రోజూ కొంచెం అటు ఇటుగా 35 లక్షల మందికి టీకాలిస్తారని అనుకుంటే ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి 40 శాతం జనాభాకు టీకాలివ్వొచ్చు. (130 కోట్ల జనాభాలో 40 శాతం 52 కోట్లు కాగా.. ఒకొక్కరికి రెండు డోసుల చొప్పున 104 కోట్ల డోసులు అవసరం. రోజుకు 35 లక్షల చొప్పున టీకాలిస్తే 52 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేందుకు దాదాపు 261 రోజుల సమయం పడుతుంది) ఈ సంఖ్య 60 శాతానికి చేరాలంటే మరో 5 నెలల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేశారు. ఆ సమయానికి సుమారు 145 కోట్ల టీకాల అవసరం ఉంటుంది. సీరమ్, భారత్‌ బయోటెక్‌లు రెండూ ఏడాదికి దాదాపు 100 నుంచి 130 కోట్ల టీకాలు మాత్రమే ఉత్పత్తి చేయగలవు.

ఏప్రిల్‌ 16 నాటికి దేశంలో రోజువారీ కేసుల సంఖ్య 2 లక్షలు దాటిపోయాయి. మరణాలు కూడా వెయ్యికి చేరుకున్నాయి. పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలంటే రోజుకు కనీసం కోటి మందికి టీకాలివ్వాలని ఇండియా స్పెండ్‌ వెబ్‌సైట్‌కు చెందిన వ్యాధి నిపుణులు ఆర్‌.గిరిధర్‌ బాబు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడిస్తున్న వేగంతోనే కార్యక్రమం కొనసాగితే డిసెంబర్‌ నాటికి 23% జనాభాకు మాత్రమే టీకాలివ్వొచ్చని, మూక నిరోధకతకు ఇది సరిపోదని చెబుతున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్, సీషెల్స్, ఇజ్రాయెల్‌లో 40% జనాభాకు టీకాలిచ్చిన తర్వాత కేసుల సంఖ్య 40% వరకు తగ్గిపోయిందని వివరించారు.  

కొత్త టీకాలు వస్తాయా? 
పెరుగుతున్న కోరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌–వీ టీకాకు కేంద్రం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఫైజర్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి విదేశీ టీకాలకూ అనుమతులిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలలోనే స్పుత్నిక్‌–వీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే జరిగితే దేశీయంగా మరో 1.25 కోట్ల మం దికి సరిపడా టీకాలు అందుబాటులోకి వస్తాయి. స్పుత్నిక్‌–వీ టీకా తయారీ, పంపిణీ హక్కులు సంపాదించుకున్న డాక్టర్‌ రెడ్డీస్, హెటెరో, గ్లాండ్‌ విర్‌చో బయోటెక్‌ కంపెనీలతో కలసి టీకా ఉత్పత్తి చేపట్టనున్నాయి. దీనికి అదనంగా రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) కూడా దేశీయంగా మూడు ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేపట్టనుంది. ఈ కంపెనీలన్నీ ఉత్పత్తి ప్రారంభిస్తే ఈ నెలాఖరు నుంచి మొదలుపెట్టి వచ్చే నెల చివరికల్లా కొన్ని కోట్ల టీకాలు కొత్తగా అందుబాటులోకి వస్తాయి.
చదవండి: ఒకసారి ఈ మందు వాడితే కరోనా నుంచి నెలరోజుల రక్షణ! 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top