ఇక్కడ డిపాజిట్ల కంటే రుణాలు ఎక్కువ | Union Minister Kishan reddy About telangana Banks | Sakshi
Sakshi News home page

ఇక్కడ డిపాజిట్ల కంటే రుణాలు ఎక్కువ

Jan 8 2023 2:41 AM | Updated on Jan 8 2023 10:40 AM

Union Minister Kishan reddy About telangana Banks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయని.. డిపాజిట్ల కంటే ఎక్కువగా రుణాలు ఇవ్వడం మంచి పనితీరుకు నిదర్శమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక బ్యాంకుల ప్రాధాన్యం బాగా పెరిగిందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని కోఠి స్టేట్‌బ్యాంకులో రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు.

కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలకు బ్యాంకులు లోన్లు ఎలా మంజూరు చేస్తున్నాయనే దానిపై సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. దేశంలోని పేద ప్రజల్లో ఆత్మ విశ్వాసం పెంచేలా ప్రధాని మోదీ జన్‌ధన్‌ఖాతాలు తెరిపించారని, ఆ ఖాతాల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు దళారుల దోపిడీ లేకుండా నేరుగా అమలవుతున్నాయని కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు 2020–21లో రూ.40,564 కోట్లు, 2021–22లో రూ.42,853 కోట్లు ఇచ్చారని.. 2022–23లో రూ.40,718 కోట్లు లక్ష్యంకాగా.. ఇప్పటివరకు 58.43 శాతం రుణాలు ఇచ్చారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా వ్యవసాయ రుణమాఫీ చేయాలని కోరారు. 

ఇక్కడ బ్యాంకుల క్రెడిట్‌ రేషియో ఎక్కువ 
రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో కలిపి రూ.6,32,834 కోట్ల డిపాజిట్లు ఉంటే.. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా డిపాజిట్ల కన్నా ఎక్కువగా రూ.7,25,568 కోట్లు రుణాలు ఇవ్వడం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. తెలంగాణ క్రెడిట్, డిపాజిట్‌రేషియో దేశంలోనే ఎక్కువగా 114.65 శాతంగా ఉందని తెలిపారు. ఇది బ్యాంకుల పనితీరుకు అద్దంపడుతోందని ప్రశంసించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఆయా ప్రాధాన్య రంగాలకు రూ.84,143 కోట్ల రుణాలు ఇచ్చాయని.. అందులో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.38,737 కోట్లు మంజూరు చేశాయని వివరించారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన, స్టాండప్‌ఇండియా, ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్‌జనరేషన్‌ప్రోగ్రామ్‌ (పీఎంఈజీపీ), పీఎం స్వానిధి పథకాల కింద ఆయా వర్గాలకు బ్యాంకుల నుంచి గణనీయంగా ఆర్థిక సాయం అందినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్‌యోజన పథకం కింద బ్యాంకులు 62,516 గృహ నిర్మాణాలకు రుణాలు మంజూరు చేశాయని, లబ్ధిదారులు రూ.1,427.72 కోట్లు సబ్సిడీగా పొందారని చెప్పా రు. కాగా.. రాష్ట్రంలో రుణమాఫీ కింద ఎంత మంది రైతులకు, ఎన్ని కోట్ల మేర లబ్ధి అందిందనే వివరాలను కిషన్‌రెడ్డి తెలుసుకున్నట్టు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement