కుప్పకూలిన బతుకులు 

Two Workers Killed In Slab Collapse Of Illegal Construction In Hyderabad - Sakshi

కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్‌ కూలి ఇద్దరి దుర్మరణం

భాగ్యనగర్‌కాలనీ (హైదరాబాద్‌): కూకట్‌పల్లిలో ఓ భవనం నాలుగో అంతస్తు స్లాబ్‌ నిర్మాణం అలా జరిగిందో లేదో.. ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మూడో అంతస్తు సైతం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. భవనం స్లాబ్‌లు పెద్దశబ్ధంతో కూలడంతో చుట్టుపక్కలవారు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి గ్రామంలో మూడు అంతస్తుల నిర్మాణం జరిగిన ఓ భవనంపై శనివారం నాలుగో అంతస్తు స్లాబ్‌ వేశారు.

అయితే స్లాబ్‌ పూర్తి అయిన కొద్ది సేపటికి ఊతంగా కట్టిన కర్రల తాడును కూలీలు తీస్తుండగా ఒక్కసారిగా నాలుగో అంతస్తు శ్లాబ్‌ కూలిపోయింది. ఆ సమయంలో స్లాబ్‌పై ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దయాశంకర్‌ (25), ఆనంద్‌ (23) అనే ఇద్దరు కార్మికులు శిథిలాల కింద పడి అక్కడడిక్కడే మృతి చెందారు. స్లాబ్‌ కూలిన సమయంలో అక్కడే ఉన్న భవన యజమాని లక్ష్మణ్‌రావుకు తలపై గాయం కావటంతో వెంటనే ఆయనను ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

వాసు అనే మరో వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. భవనం కూలిన విషయం తెలుసుకున్న కూకట్‌పల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. జీహెచ్‌ఎంసీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, డీఆర్‌ఎఫ్, ఫైర్‌ సిబ్బందికి వారు సమాచారం ఇవ్వడంతో ఆయా విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకోగా సకాలంలో అధికారులు చేరుకున్నప్పటికీ సహాయక చర్యలు చేపట్టడంలో ఆలస్యం చోటుచేసుకుంది. శిథిలాల కింద సాయంత్రం 5.30 గంటలకు మృతి చెందిన వారిలో ఒకరి చేయి బయటకు కనిపించింది. దీంతో స్లాబ్‌కు వాడిన ఇనుప చువ్వలను కట్‌ చేసి, సిమెంట్‌ పెచ్చులను తొలగించి అతికష్టంమీద రాత్రి కల్లా రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఈ భవనానికి రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. మృతులు ఇద్దరికీ వివాహాలు కాగా బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.  

‘సెంట్రింగ్‌’ లోపమే కారణమా? 
భవన స్లాబ్‌ నిర్మాణ సమయంలో సెంట్రింగ్‌ పనులు సరిగా చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్లాబ్‌ నిర్మాణం జరిపే సమయంలో భారీగా సిమెంట్, కాంక్రీట్‌ మిశ్రమాన్ని పోస్తుంటారు. అయితే ఆ బరువుకు తగ్గట్లుగా సెంట్రింగ్‌ పనులు జరగలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగో స్లాబ్‌ పరిస్థితి ఇలా ఉంటే.. మూడో స్లాబ్‌ కూడా కూలడంతో నాణ్యతలో డొల్ల తనం స్పష్టం తెలుస్తోంది. స్లాబ్‌లకు సరిగ్గా క్యూరింగ్‌ జరపకుండా అంతస్తులపై అంతస్తులు నిర్మించడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. 

అనుమతులకు మించి అంతస్తులు.. 
వాస్తవానికి జీహెచ్‌ఎంసీ నుంచి భవనం యజమాని జీ ప్లస్‌ 2 నిర్మాణానికి అనుమతి పొందినట్లు సమాచారం. అయితే అంతకుమించి 3, 4 అంతస్తులను అక్రమంగా నిర్మాణం ని ర్మించారు. ముందుగానే అధికారులు అడ్డుకుని ఉంటే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసేవి కావని స్థానికులు అంటున్నారు.  

క్రిమినల్‌ కేసులు పెడతాం: డీసీ రవీందర్‌కుమార్‌ 
ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌కుమార్‌ స్పందించారు. ముందుగా తీసుకున్న అనుమతులకు మించి అదనపు అంతస్తులు వేయడంతో.. ప్రమాదానికి కారణమైన భవన యజమాని, ఆర్కిటెక్ట్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అనుమతికి మించి అంతస్తులు నిర్మించినందుకు భవన యజమానికి జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.  

ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మాధవరం.. 
స్లాబ్‌లు కూలిన భవనాన్ని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్‌ జూపల్లి సత్యనారాయణలు పరిశీలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top