
ఫిలింనగర్: ప్రేమ జంటకు ఆశ్రయం ఇచ్చినందుకు యువతీ, యువకులను ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ప్రేమజంట మధ్య విబేధాలు రావడంతో సదరు బాలిక ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆమె మైనర్ కావడంతో ఆమె ప్రియుడిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో భాగంగా బాధితురాలు తమకు ఫిలింనగర్‌లోని బీజేఆర్‌నగర్‌లో నివసించే కోనె అఖిల్ అనే యువకుడు తన గదిలో ఆశ్రయం ఇచి్చనట్లు చెప్పింది.
దీంతో బాలికతో పాటు ఆమె ప్రియుడికి చట్టవిరుద్ధంగా గదిని ఇచ్చినందుకుగాను పోలీసులు కోనె అఖిల్, అతడికి సహాయపడిన నిఖిత అనే యువతిని గురువారం అరెస్టు చేశారు. బీజేఆర్‌నగర్ బస్తీకి చెందిన యువకుడు, మైనర్ బాలిక ప్రేమించుకున్నారు. వీరిద్దరూ తరచూ కలుసుకునేందుకు అఖిల్ పలుమార్లు తన గదిని ఇచ్చాడు. అంతేగాక ఇదే బస్తీలో నివసించే నిఖిత అనే యువతి కూడా వీరికి పలుమార్లు ఆశ్రయం కల్పించింది. ఇలా గదులు ఇవ్వడం చట్టవిరుద్ధం కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గదులు ఇచ్చిన వారిని కూడా నిందితులుగా చేర్చి అరెస్టు చేశారు.
బస్తీల్లో, కాలనీల్లో, అపార్ట్‌మెంట్లలో ఎవరైనా స్నేహితులకు తమ గదులను ఇస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఫిలింనగర్ ఇన్‌స్పెక్టర్ సంతోషం హెచ్చరించారు. ముఖ్యంగా ఫిలింనగర్ 18 బస్తీల్లో కొందరు ప్రేమ జంటలకు తమ గదులను వాడుకునేందుకు ఇస్తున్నట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయని, వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ఇళ్ల యజమానులు తమ ఇళ్లల్లో అద్దెకు ఉంటున్న వారి ఇంటికి ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో తెలుసుకుని అనుమానాస్పదంగా ఉంటే బయటకు పంపించాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.