సొరంగం జిందాబాద్..! | Tunnel excavations increasing rapidly in country: Telangana | Sakshi
Sakshi News home page

సొరంగం జిందాబాద్..!

Published Tue, Apr 15 2025 1:22 AM | Last Updated on Tue, Apr 15 2025 1:22 AM

Tunnel excavations increasing rapidly in country: Telangana

స్వీడన్‌లో వరల్డ్‌ టన్నెలింగ్‌ కాంగ్రెస్‌  

దేశంలో వేగంగా పెరుగుతున్న సొరంగాల తవ్వకం

రూ.1.60 లక్షల కోట్లతో నిర్మాణాలు/ప్రణాళికలు 

ఇరిగేషన్, రోడ్డు, రైలు రవాణాలో అనేక చోట్ల టన్నెళ్లు 

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంతో భద్రతపై జోరుగా చర్చ

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగం కుప్పకూలి 50 రోజులు దాటుతోంది. మొత్తం 8 మంది కార్మికులు చిక్కుకుపోగా వందల మంది సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నా ఇప్పటికీ ఆరుగురు కార్మికుల జాడ బయటపడకపోవడం సొరంగాల నిర్మాణం ఎంత రిస్క్ తో కూడుకున్న వ్యవహారమో స్పష్టం చేస్తుంది. సాగునీటి ప్రాజెక్టులతో పాటు రైలు మార్గాలు, రహదారుల కోసం ప్రపంచ వ్యాప్తంగా వీటిని నిర్మిస్తుంటారు. కొన్ని కొండ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయం లేనప్పుడు సొరంగాల నిర్మాణం అనివార్యమవుతోంది.

ఈ క్రమంలోనే గత దశాబ్ద కాలంగా దేశంలో సొరంగాల నిర్మాణం ఊపందుకుంది. గత ఏడాది డిసెంబర్‌ నాటికి దేశంలో 60 కి.మీ. నిడివి గల 42 సొరంగ మార్గాల నిర్మాణం పూర్తి చేశారు. మరో 75 సొరంగ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 146 కి.మీ. నిడివి గల వీటి నిర్మాణానికి ప్రభుత్వాలు రూ.49 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు కాగల మరో 78 ప్రాజెక్టులు ప్రణాళికల స్థాయిలో ఉన్నాయి. వీటి మొత్తం నిడివి 286 కి.మీ. కావటం విశేషం. ‘ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రీసెర్చ్‌’నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో సొరంగ మార్గాల మొత్తం నిడివి 3,400 కి.మీ.కు చేరుకుంది. అయితే ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం నేపథ్యంలో ఇప్పుడు సొరంగాల నిర్మాణం చర్చనీయాంశమవుతోంది.  

దేశంలోని ప్రధాన సొరంగాలు
అస్సాంలో బ్రహ్మపుత్ర నదీ గర్భంలో నేషనల్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 34 కి.మీ. భారీ సొరంగమార్గాన్ని రూ.6,000 కోట్ల వ్యయంతో నిర్మించబోతోంది. ఇందులో నాలుగు వరుసల రహదారితోపాటు ప్రత్యేకంగా రైల్వే లైన్‌ కూడా ఉండనుంది. దేశంలో ఇదే భారీ సొరంగ మార్గం కాబోతోంది. ఇది పూర్తయితే గోహ్‌పూర్‌–నుమాలిగర్‌ పట్టణాల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం పడుతున్న 6.30 గంటల సమయం అరగంటకు తగ్గుతుంది.  

⇒  రూ.4,965 కోట్లతో హుగ్లీ నదీ గర్భంలో నిర్మించిన కోల్‌కతా ఈస్ట్‌–వెస్ట్‌ మెట్రో కారిడార్‌ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది.  

జమ్మూకశ్మీర్‌లో ప్రధాన ప్రాంతాలను అనుసంధానిస్తూ నిర్మిస్తున్న ఉదంపూర్‌–శ్రీనగర్‌–బారాముల్లా రైల్‌లింక్‌ ప్రాజెక్టు (యూఎస్‌బీఆర్‌ఎల్‌) ప్రపంచంలో సొరంగాలతో కూడిన కీలక మార్గాల్లో ఒకటిగా నిలుస్తోంది. 324 కి.మీ. నిడివి ఉండే ఈ మార్గంలో ఏకంగా 38 సొరంగాలు ఉండటం విశేషం. మొత్తం 324 కి.మీ. నిడివి గల ఈ మార్గంలో సొరంగాల నిడివి ఏకంగా 119 కి.మీ. కావటం గమనార్హం. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.28 వేల కోట్లు. 359 మీటర్లతో ప్రపంచంలోనే అతి ఎత్తయిన చీనాబ్‌ రైలు వంతెన ఇందులో భాగమే.  

⇒ ఈ మార్గంలో ఖరి–సంబర్‌ మధ్య 12.77 కి.మీ. ఫిర్‌పంజాల్‌ పర్వత శ్రేణిలో బనిహాల్‌–ఖాజీగుండ్‌ మధ్య 11.2 కి.మీ. ఖాద్‌–అంజిఖాద్‌ మధ్య 5.09 కి.మీ. పొడవైన సొరంగాలు నిర్మించారు. ఈ సొరంగాల్లో ప్రతి 375 మీటర్లకు ఒక ఎస్కేప్‌ మార్గం ఏర్పాటుచేస్తున్నారు.  

⇒ థానే – «ముంబ్రా/దివా (ముంబై శివారు) మధ్య 1915లో నిర్మించిన 1.3 కి.మీ. పొడవైన పార్సిక్‌ సొరంగం మనదేశంలో అతి పురాతనమైనది. దీన్ని గ్రేట్‌ ఇండియన్‌Œ పెనిన్సులా రైల్వే నిర్మించింది.  
⇒  ఇంటర్నేషనల్‌ టన్నెలింగ్‌ అండ్‌ అండర్‌గ్రౌండ్‌ స్పేస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏటా డిసెంబర్‌ 4వ తేదీన ప్రపంచ సొరంగమార్గ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

మే 9 నుంచి 15 వరకు వరల్డ్‌ టన్నెల్‌ కాంగ్రెస్‌
స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో మే 9–15 మధ్య వరల్డ్‌ టన్నెల్‌ కాంగ్రెస్‌ జరగనుంది. సొరంగ మార్గాల సుస్థిర అభివృద్ధి.. అందుకు దోహదం చేసే పద్ధతులు, కొత్త సాంకేతికత ఇతివృత్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.  

ప్రమాదం నుంచి కొత్త ఉపాయం
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో సహాయక చర్యల కోసం ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు కొత్త ఆలోచన తట్టింది. హైదరాబాద్‌–శ్రీశైలం హైవే విస్తరణలో భాగంగా అమ్రాబాద్‌ అభయారణ్యం మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని తొలుత భావించారు. అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి ఇది ప్రారంభం కావాల్సి ఉంది.

దాదాపు 42 కి.మీ. నిడివి ఉండే దీనికి రూ.8 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని తాత్కాలిక అంచనా. అయితే, ఎలివేటెడ్‌కు బదులు, సొరంగ మార్గం నిర్మిస్తే నిడివి కేవలం 22 కి.మీ.లకే పరిమితమై రూ.6 వేల కోట్ల ఖర్చుతో పూర్తవుతుందని అంచనా వేశారు. ఇదే కొత్త ఐడియా. ఎలివేటెడ్‌కు ప్రత్యామ్నాయ ప్రతిపాదనగా నివేదిక సిద్ధం చేశారు. కేంద్రం ఆమో దం తెలిపితే తెలంగాణలో తొలి సొరంగ మార్గం అవుతుంది.  

మనదేశంలో పలు సొరంగ ప్రమాదాలు 
2025 ఫిబ్రవరి: ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం కుప్పకూలి ఎనిమిది మంది చిక్కుకుపోయారు. ఇప్పటివరకు ఇద్దరి శవాలు మాత్రమే వెలికితీయగలిగారు. 
2025 జనవరి: అస్సాంలోని బొగ్గుగని సొరంగం కుప్పకూలి నలుగురు చనిపోయారు.  
2024 డిసెంబర్‌: ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే సొరంగం కూలి ఒకరు మృతిచెందగా, 10 మందికి గాయాలయ్యాయి.  

2023 నవంబర్‌: ఉత్తరాఖండ్‌లోని సిల్‌్కయారా రోడ్డు ప్రాజెక్టు సొరంగం కూలిపోయి 41 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. 17 రోజుల తర్వాత వీరిని కాపాడగలిగారు.  
2019 సెప్టెంబర్‌: కోల్‌కతా మెట్రో రైల్‌ ప్రాజెక్టు టన్నెల్‌ నిర్మాణ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమీ జరగలేదు. 
2004 ఆగస్టు: ఉత్తరాంచల్‌లో తెహ్రీ హైడ్రో ప్రాజెక్టు సొరంగం నిర్మాణ సమయంలో కుప్పకూలి 29 మంది దుర్మరణం చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement