సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నాలుగో రోజు ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల బంద్ కొనసాగుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను 50 శాతం చెల్లించాలని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో నిన్న(బుధవారం) ప్రభుత్వంతో చర్చలకు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య వెళ్లినప్పటికీ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో, ఫెడరేషన్ ప్రతినిధులు వెనక్కి వచ్చేశారు.
కాగా, పదివేల కోట్ల రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిల్లో రూ.5,000 కోట్లు విడుదల చేసేదాకా కాలేజీల నిరవధిక బంద్ కొనసాగుతుందని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (FATHI) స్పష్టంచేసింది. మిగతా రూ.5,000 కోట్లలో నెలకు రూ.500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకూ కాలేజీల బంద్ పాటిస్తామని ఫతి చైర్మన్ నిమ్మటూరి రమేశ్‌బాబు తేల్చిచెప్పారు.
బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఫతి కార్యవర్గ సమావేశం అనంతరం రమేశ్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం యాజమాన్యాలు పోరాడాల్సిన పరిస్థితి దాకా సర్కార్ నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. అసలు విద్యార్థులు, కాలేజీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు కావా? అని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున కాలేజీలు బంద్ పాటిస్తుంటే ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదని, ఈ సమస్యను ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెట్టిందని నిలదీశారు.
అధ్యాపకులకు జీతాలిచ్చే పరిస్థితి లేకపోవడవంతోనే తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము బంద్‌కు దిగాల్సి వచ్చిందని చెప్పారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల ఎనిమిదో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అధ్యాపకులతో భారీ సభను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సభకు ‘తెలంగాణ అధ్యాపకుల సాంత్వన సభ’గా పేరు పెట్టామని, లక్షన్నర మంది అధ్యాపకులతో ఈ సభ జరుగుతుందని తెలిపారు. 10 లక్షల మందితో చలో హైదరాబాద్ పేరిట ఇదే నెల 11న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యాచరణ విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.


