అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఆ ప్రతిపాదనలు సిద్ధం చేయండి
త్వరలో మహారాష్ట్రకు వెళ్లి సంప్రదింపులు జరుపుతాం
కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ బాధ్యత కాంట్రాక్టర్లదే
సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించి 80 టీఎంసీల జలాలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ బరాజ్ నిర్మాణంతో మహా రాష్ట్రలో ఏర్పడే ముంపుపై అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు త్వరలో మహారాష్ట్రలో పర్యటించనున్న ట్టు ఆయన తెలిపారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణపై మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బరాజ్ నుంచి సుందిళ్ల బరాజ్‌కి గ్రావిటీ ద్వారా నీళ్లను తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎత్తిపోయాలనే ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌ను ఈ సమావేశంలో సూత్రప్రాయంగా ఆమో దించారు.
తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించినా 80 టీఎంసీల నీళ్లను తరలించుకోవచ్చనే వాదన ను ఈ సమావేశంలో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) అధికారులు తోసిపుచ్చారు. కనీసం 149 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తేనే 80 టీఎంసీలను గ్రావిటీతో సుందిళ్ల వరకు తరలించగలమని స్పష్టం చేశారు. దీంతో 150 మీటర్ల ఎత్తు లో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రాణహిత ప్రాజెక్టు కింద గతంలో నిర్మించిన పనులను వినియోగంలోకి తెచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనల రూపకల్పన జరగాలన్నారు. సుందిళ్ల బరాజ్‌కు సత్వరం మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఇందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
కాళేశ్వరం మరమ్మతుల బాధ్యత కాంట్రాక్టర్లదే..
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థలదేనని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చిచెప్పారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ –2021 ప్రకారం 5 ఏళ్లలోపు దేశంలోని ఆనకట్టల భద్రతకు సంబంధించిన సమగ్ర మూల్యాంకనం పూర్తి చేయాల్సి ఉండగా, ఈ విషయంలో రాష్ట్రం వెనకబడిందని పేర్కొంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఈ నెల 17న సీఎం రేవంత్‌కు లేఖ రాశారు.
రాష్ట్రంలోని 173 ఆనకట్టల భద్రతకి సంబంధించి మూల్యాంకనం పూర్తిచేసేందుకు 15 నెలల సమయమే మిగిలి ఉందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు స్వయంగా సమీక్ష నిర్వహించాలని సీఎంకు కేంద్ర మంత్రి సూచించారు. దీంతో కేంద్రం నిర్దేశించిన గడువులోగా అన్ని ఆనకట్టల భద్రతకు సంబంధించి మూల్యాంకనం పూర్తిచేసి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. పురోగతి విషయంలో ఆనకట్టలవారీగా స్థితిగతుల నివేదిక రూపొందించాలని, నవంబర్ రెండోవారంలో మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.


