అమ్మో.. డ్యూటీనా?

TSRTC Employees Getting Worried About Coronavirus - Sakshi

సిటీ ఆర్టీసీలో అలజడి..

బస్సులు ప్రారంభిస్తే విధులకు సెలవేనంటున్న సిబ్బంది

ఆర్టీసీలో నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువ శాతం ఇక్కడే..

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు భయం పట్టుకుంది. అన్‌లాక్‌– 4లో భాగంగా కేంద్రప్రభుత్వం మెట్రో రైళ్లు నడిపేందుకు పచ్చజెండా ఊపనుందనే సమాచారమే వారి ఆందోళనకు కారణం. మెట్రో రైళ్లు నడిపితే హైదరాబాద్‌లో సిటీ బస్సులు కూడా ప్రారంభించే అవకాశముం టుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుం డటంతో వారి గుండెల్లో దడ మొదలైంది. బస్సులు ప్రారంభమైతే కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని, తామూ వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉంటుందని ఎక్కువ మంది భయపడుతున్నారు. 

నగరంలోనే కేసులెక్కువ..
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 600 మందికిపైగా ఆర్టీసీ సిబ్బంది కోవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో దాదాపు 40 మంది వరకు చనిపోయారని కార్మిక సంఘాలు పేర్కొంటు న్నాయి. అయితే నగరంలో సిటీ బస్సులు నడపనప్పటికీ, ఇక్కడే ఎక్కువ మంది కోవిడ్‌ బారిన పడటం గమనార్హం. బస్సులు  తిరగకున్నా రొటేషన్‌ పద్ధతిలో విధులకు హాజరవుతున్నారు. జిల్లాలతో పోలిస్తే నగరంలో డిపోలు ఇరుగ్గా ఉంటాయి. ప్రస్తుతం బస్సులు డిపోలకే పరిమితం కావ టంతో నిలబడేందుకు కూడా స్థలం లేకుండా పోయింది. ఇదే సమస్యకు కారణమవు తోంది. హైదరాబాద్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, బయట వైరస్‌ సోకిన ఉద్యోగి విధులకు హాజరైతే వారి ద్వారా తోటి ఉద్యోగులు దాని బారిన పడుతున్నారు. ఫలితంగా జిల్లాలతో పోలిస్తే నగరంలోనే కోవిడ్‌ బారిన పడ్డ ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. చనిపోతున్నవారిలో కూడా ఇక్కడే ఎక్కువ నమోదవటం విశేషం. ఈ నేపథ్యంలోనే  సిటీ బస్సులు ప్రారంభిస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని సిబ్బంది తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. 

55 ఏళ్లు దాటిన వారి సంఖ్య ఎక్కువే..
ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ల సంఖ్యే ఎక్కువ. వీరిలో 55 ఏళ్ల పైబడ్డవారు రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది ఉన్నారు. వీరిలో 13 వేల మంది నగరంలోనే ఉన్నారు. కరోనా బారిన పడి చనిపోతున్నవారిలో ఈ వయసు వారే ఎక్కువగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఒకవేళ సిటీ సర్వీసులు ప్రారంభమైతే  వారంతా సెలవు పెట్టాలని భావిస్తున్నారు.

ఇక్కడ రద్దీ ఉండే అవకాశం..
ప్రస్తుతం జిల్లాల్లో నడుస్తున్న బస్సులు చాలావరకు ఖాళీగానే తిరుగుతున్నాయి. కానీ, నగరంలో ఆ పరిస్థితి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. నగరంలో రోడ్లన్నీ ట్రాఫిక్‌ రద్దీతో దర్శనమిస్తున్నాయి. బస్సులు ప్రారంభమైతే అవి రద్దీగానే ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉంటుందని ఆర్టీసీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అయితే మెట్రో రైళ్లు ప్రారంభించాల్సిన పరిస్థితి ఉన్నా, సిటీ బస్సులు ప్రారంభించకపోవచ్చని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top