కరోనా దెబ్బ: తిరోగమనమే! | TS Revenue Decreased In First Six Months Over Corona Effect | Sakshi
Sakshi News home page

కరోనా దెబ్బ: తిరోగమనమే!

Oct 31 2020 1:08 AM | Updated on Oct 31 2020 8:28 AM

TS Revenue Decreased In First Six Months Over Corona Effect - Sakshi

కరోనా దెబ్బకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం కకావికలం అయిందని అర్ధ వార్షిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: కరోనా దెబ్బకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం కకావికలం అయిందని అర్ధ వార్షిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల ఆదాయ వివరాలను పరిశీలిస్తే అప్పులు మినహా అన్నిం టిలో తిరోగమనమే కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు అన్ని రకాల ఆదాయాలు తగ్గిపోయాయని కాగ్‌ లెక్కలు చెబు తున్నాయి. గతేడాదితో పోలిస్తే జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, అమ్మకపు పన్ను... ఇలా అన్ని ఆదాయాలు తగ్గాయి. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద కేంద్ర సాయం కూడా ఆశించినంత లేకపోవడంతో తొలి ఆరు నెలల ఆదాయం రూ. 63,970 కోట్లకే పరిమితమైంది.

కాగ్‌ తేల్చిన ముఖ్యాంశాలివి..

  • 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,76,393 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించగా ఆరు నెలల్లో వచ్చిన మొత్తం ఆదాయం రూ. 63,970 కోట్లు. అంటే బడ్జెట్‌ అంచనాలో వచ్చింది కేవలం 36 శాతమే. అదే గతేడాది ఆరు నెలల్లో 43 శాతం రాబడులు సమకూరాయి.
  • ఈ ఏడాది మొత్తం రూ. 33,191 కోట్లు అప్పులు సమకూర్చుకోవాల్సి ఉండగా తొలి ఆరు నెలల్లో 78 శాతం అంటే రూ. 25,989 కోట్లు వచ్చేశాయి. అదే గతేడాది ఆరు నెలల్లో 61 శాతమే అప్పులు అవసరమయ్యాయి.
  • ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 32,671 కోట్లు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ద్వారా వస్తుందని అంచనా వేయగా ఆరు నెలల్లో 32 శాతం అంటే రూ. 10,437 కోట్లు వచ్చింది.
  • స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ. 10,000 కోట్లు వస్తాయని వార్షిక బడ్జెట్‌ అంచనాలో చూపగా ఆరు నెలల్లో వచ్చింది రూ. 1,657 కోట్లే. 
  • అమ్మకపు పన్ను కింద 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 26,400 కోట్ల రాబడి అంచనా కాగా తొలి సగం ఏడాదిలో రూ. 8,148 కోట్లు వచ్చాయి. బడ్జెట్‌ అంచనాలో రాబడి 31 శాతం. అమ్మకపు పన్ను ఆదాయం గతేడాది తొలి అర్ధ వార్షికంలో 42 శాతం సమకూరింది.
  • ఎక్సైజ్‌ ఆదాయం మాత్రమే ఈ ఏడాది కొంచెం మెరుగ్గా కనిపిస్తోంది. ఈ సంవత్సరం రూ. 16,000 కోట్ల అంచనాలో రూ. 6,285.85 కోట్లు (39 శాతం) వచ్చింది. గతేడాది వచ్చింది 42 శాతం.

  • కేంద్ర పన్నుల్లో వాటా కూడా ఈ ఏడాది అంతంత మాత్రంగానే వచ్చింది. ఈ వాటా కింద 2020–21 సంవత్సరంలో రూ. 10,906 కోట్లు రావాల్సి ఉండగా ఆరు నెలల్లో రూ. 3,753 కోట్లు మాత్రమే వచ్చాయి. 
  • కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లో కూడా గతేడాదితో పోలిస్తే తగ్గుదల కనిపిస్తోంది. గత సంవత్సరం బడ్జెట్‌ అంచనాకుగాను తొలి ఆరు నెలల్లో 55 శాతం రాగా, ఈసారి వచ్చింది 44 శాతమే. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ. 10,525 కోట్ల అంచనాకుగాను రూ. 4,649 కోట్లు వచ్చాయి.
  • ఈ ఏడాది పన్నేతర ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఈసారి రూ. 30,600 కోట్లను పన్నేతర ఆదాయం కింద అంచనా వేయగా అందులో 5 శాతం అంటే కేవలం రూ. 1,542 కోట్లే సగం సంవత్సరం పూర్తయ్యే సరికి వచ్చాయి.
  • పన్ను ఆదాయం విషయానికి వస్తే గతేడాది సెప్టెంబర్‌లో రూ. 8,775 కోట్లను పన్ను ఆదాయం కింద రాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చింది రూ. 6,599 కోట్లు మాత్రమే వచ్చింది. 
  • గతేడాది తొలి అర్ధ వార్షికంలో రెండు నెలలు పన్ను ఆదాయం రూ. 8,500 కోట్లు దాటితే ఈ ఏడాది రూ. 6,500 కోట్లు దాటలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement