Telangana: రాష్ట్రంలో గవర్నెన్స్‌ ‘గుడ్‌’

TS Good Governance Index 2021 Ranking Tops Two Of 10 Sectors - Sakshi

గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌–2021లో రెండు విభాగాల్లో తొలి స్థానం 

వాణిజ్యం–పరిశ్రమలు, సాంఘిక సంక్షేమం–అభివృద్ధిలో మనమే బెస్ట్‌ 

ఢిల్లీలో నివేదిక విడుదల చేసిన కేంద్ర మంత్రి అమిత్‌ షా 

సాక్షి, హైదరాబాద్‌: సుపరిపాలనలో తెలంగాణ ముందంజలో ఉంది. కేంద్రం విడుదల చేసిన గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌–2021లో రెండు కేటగిరీల్లో మొదటి స్థానంలో నిలిచింది. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పరిపాలన సం స్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వ ర్యంలో రూపొందించిన ఈ ఇండెక్స్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా విడుదల చేశారు. ఆ ప్రకారం వాణిజ్యం–పరిశ్రమలు, సాంఘిక సంక్షేమం–అభి వృద్ధి కేటగిరీల్లో మన రాష్ట్రం గ్రూప్‌–ఏలో కేరళతో సమానంగా తొలి స్థానం దక్కించుకుంది.

తెలంగాణతో పాటు ఏపీ, పంజాబ్, కేరళ, గోవా, గుజరాత్, తమిళనాడు, హరియానా తదితర రాష్ట్రాలను గ్రూప్‌–ఏ కింద పరిగణించగా, గ్రూప్‌–బీ కింద మరికొన్ని రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు.. ఇలా 4 గ్రూపుల్లో 10 కేటగిరీల్లో మొత్తం 58 సూచికల ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.

వ్యవసాయ అనుబంధ రంగాలు, వాణిజ్యం–పరిశ్రమలు, మానవ వనరుల అభివృద్ధి, ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక పరిపాలన, సాంఘిక సంక్షేమం–అభివృద్ధి, న్యాయం–ప్రజా భద్రత, పర్యావరణం, పౌర కేంద్రిత పాలన కేటగి రీల్లో అన్ని రాష్ట్రాల పనితీరును పరిశీలించి ఈ ర్యాంకులిచ్చారు. ఈ 10 కేటగి రీల్లో ఆయా రాష్ట్రాల పనితీరు ఆధారంగా ఇచ్చిన కాంపోజిట్‌ ర్యాంకింగ్స్‌లో గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, ఢిల్లీలో మొదటి స్థానాలు నిలిచాయి.  

రాష్ట్రం ర్యాంకు సాధించిన రెండు కేటగిరీల్లోని సూచికలివే 
ఈ 10 కేటగిరీల్లో పలు సూచికల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించారు. రాష్ట్రానికి మొదటి స్థానం లభించిన 2 కేటగిరీల విషయానికి వస్తే.. వాణిజ్యం–పరిశ్రమల విభాగం లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్, రాష్ట్రంలోని పరిశ్రమల సంఖ్య, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి ప్రాతిపదికగా ర్యాంకులు కేటాయించారు. సాంఘిక సంక్షేమం–అభివృద్ధి కేటగిరీలో లింగ నిష్పత్తి, ఆరోగ్య బీమా కవరేజీ, గ్రామీణ ఉపాధి, నిరుద్యోగం, అందరికీ ఇళ్లు, మహిళా ఆర్థిక సాధికారత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాధికారత, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కేసుల పరిష్కారం అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top