‘టీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌‌ ఎంఐఎం చేతిలో’

TRS and MIM Midnight Love say Bandi Sanjay - Sakshi

పత్రిక ప్రకటనలో బండి సంజయ్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎంఐఎం సహాయంతో మేయర్‌, ఉప మేయర్‌ పదవులు దక్కించుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ స్పందించారు. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అక్రమ సంబంధం మరో సారి బహిర్గతమైందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము చెప్పిన విషయం నిజమైందని చెప్పారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం రెండు పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటూ బయటకు వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేశాయని పేర్కొన్నారు.

మేయర్‌ ఎన్నికపై జరిగిన పరిణామాలపై గురువారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆ రెండూ పార్టీలు కలిసి పోటీ చేయకపోయి ఉంటే టీఆర్‌ఎస్‌కు సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదని బండి సంజయ్‌ తెలిపారు. టీఆర్‌ఎస్ పక్కా మతతత్వ పార్టీ అయిన ఎంఐఎం చెంచా అని ఈ రోజు ఋజువైనదని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండటం ఖాయమని స్పష్టం చేశారు.

సిగ్గు లేక ఎన్నికల్లో తాము వేర్వేరు అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నారని సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతివంతమైన రాజకీయం చేయాలని భావిస్తే బహిరంగ పొత్తు పెట్టుకోవాల్సిందని సూచించారు. ఈ రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తమ పార్టీ కార్పొరేటర్లు హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటారని తెలిపారు. పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా వదిలేసినా ఆ రెండు పార్టీలను బజారుకు లాగుతామని హెచ్చరించారు. ప్రజలు టీఆర్‌ఎస్ నీచ రాజకీయాలను సహించారని, అవకాశం వచ్చినా ప్రతి సారి కర్రు కాల్చి వాటా పెడతారని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top