రూ. 232 కోట్లు ఎగ్గొట్టి ‘పరుగులు’!

Transport department launched special drive - Sakshi

రాష్ట్రంలో త్రైమాసిక పన్ను ఎగ్గొట్టిన 2.17 లక్షల రవాణా వాహనాలు 

3 నుంచి 18 నెలలుగా పెండింగ్‌లోనే పన్ను చెల్లింపులు 

ఎట్టకేలకు స్పెషల్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టిన రవాణాశాఖ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా 2,17,930 రవాణా వాహనాలు మూడు నెలలకోసారి చెల్లించాల్సిన త్రైమాసిక పన్ను ఎగ్గొట్టి రహదారులపై యథేచ్ఛగా పరుగులు తీస్తున్నాయి. ఏకంగా రూ. 232 కోట్లను కొన్ని నెలలుగా చెల్లించకుండానే దర్జాగా దూసుకెళ్తున్నాయి. వాటిలో కనిష్టంగా 3 నెలల కాలపరిమితి నుంచి గరిష్టంగా 18 నెలల వరకు పన్ను చెల్లించాల్సిన వాహనాలు వేలల్లోనే ఉన్నాయి. కొన్నిచోట్ల కోవిడ్‌ కాలం నుంచి కూడా పన్ను చెల్లించని వాహనాలు భారీగానే ఉన్నట్లు అంచనా. 

హైదరాబాద్‌లోనే అధికం.. 
త్రైమాసిక పన్ను ఎగ్గొట్టి తిరుగుతున్న 2.17 లక్షల వాహనాల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే లక్షకుపైగా ఉన్నాయి. ఈ క్రమంలో చాలాకాలం తర్వాత అధికారులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల రవాణా కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ పన్ను ఎగవేత వాహనాలపై సమీక్ష నిర్వహించారు.

ఒకవైపు లక్ష్యానికి మించిన ఆదాయాన్ని ఆర్జించడంపట్ల ప్రశంసిస్తూనే పన్ను ఎగవేత వాహనాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్‌లోని మూడు జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన రవాణా వాహనాలను తనిఖీ చేయాలని అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. 

గ్రేటర్‌లో ఆటోలు మినహా... 
సాధారణంగా వ్యక్తిగత వాహనాలకు ఒకసారి జీవితకాల పన్ను చెల్లిస్తే చాలు. కానీ రవాణా వాహనాలకు మాత్రం ప్రతి 3 నెలలకోసారి త్రైమాసిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల సామర్థ్యం మేరకు దీనిని నిర్ణయిస్తారు. వెయిట్‌ గ్రాస్‌ వెహికల్‌ (డబ్ల్యూజీవీ) ప్రకారం వాహనం బరువుకు అనుగుణంగా త్రైమాసిక పన్ను కనిష్టంగా రూ. 535 నుంచి గరిష్టంగా రూ. 15,000 వరకు ఉంటుంది.

గతంలో ఇచ్ఛిన ఎన్నికల హామీ మేరకు జీహెచ్‌ఎంసీలోని సుమారు 1.4 లక్షల ఆటోలను ఈ త్రైమాసిక పన్ను జాబితా నుంచి ప్రభుత్వం మినహాయించింది. మిగతా అన్ని రకాల రవాణా వాహనాలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో స్కూల్‌ బస్సులు, ప్రైవేట్‌ బస్సులు, లారీలు, క్యాబ్‌ల వంటి వాహనాలు ఉన్నాయి. కోవిడ్‌ కాలంలో పన్ను చెల్లించని రవాణా వాహనదారులు... కోవిడ్‌ ఆంక్షలను సడలించాక చాలా వరకు చెల్లించారు. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆర్టీఏ అధికారులు అప్పట్లో ఉదారంగా వ్యవహరించడం కూడా ఇందుకు కారణమైంది. 

ఎంవీఐలకు పన్ను వసూలు టార్గెట్‌లు! 
ఈ నెలాఖరు నాటికి బకాయిలు వసూలు చేయాల ని రవాణా కమిషనర్‌ అధికారులను మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. అలాగే వారికి టార్గెట్‌లు విధించారని తెలియవచ్చింది. గతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోప్రతి ఎంవీఐకి రూ. 6 లక్షల చొప్పున టార్గెట్‌ విధించగా ప్రస్తుతం దాన్ని రూ. 7 లక్షలకు పెంచారని సమాచారం.

ఈ లెక్కన ఆర్టీఏ కార్యాలయాల్లో పౌరసేవలు అందించే ఎంవీఐలు స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా రోజుకు పన్ను చెల్లించని 5 వాహ నాలను జఫ్తు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అ లాగే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధుల్లో ఉన్నవారు రోజుకు 10 వాహనాలను జఫ్తు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయితే జఫ్తు చేసిన వాహనాలను నిలిపేందుకు సరైన పార్కింగ్‌ సదుపాయం లేక ఇబ్బందులకు గురవుతున్నట్లు ఓ ఎంవీఐ పేర్కొన్నారు.  

స్వచ్ఛందంగా ముందుకొస్తేనే ఊరట...  
త్రైమాసిక పన్ను పెండింగ్‌ జాబితాలో ఉన్న వాహన యజమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్ను చెల్లిస్తే అపరాధ రుసుము ఉండదని అధికారులు చెబుతున్నారు. తనిఖీల్లో పట్టుబడితే మాత్రం 200 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

బ్లాంక్‌ డీడీలతో దళారుల వసూళ్లు 
స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా సీజ్‌ చేసిన వాహనాలపై పెనాల్టితో సహా కట్టాల్సిన బకాయిల మొత్తానికి డీడీ తీసుకురావాలని అధికారులు చెబుతుండటంతో దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. వారు అప్పటికే వివిధ మొత్తాలతో బ్యాంకుల నుంచి తెచ్చిన ఖాళీ డీడీలు చూపి ఒక్కో డీడీపై ‘సర్విస్‌ చార్జీ’గా రూ.200 వసూలు చేస్తున్నారు. దీంతో ఆరొందల నుంచి రూ.1200 వరకు ఆ రూపంలో అదనపు భారం పడుతోంది. కళ్లముందే ఈ దందా జరుగుతున్నా రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top