
బాలికల విద్యాసంస్థల్లోని పురుష ఉద్యోగులను బదిలీ చేస్తున్న సొసైటీ
దాదాపు 500 మందికి స్థానచలనం కలిగించిన ఎస్సీ గురుకుల సొసైటీ
ఏకపక్షంగా బదిలీ చేస్తున్నారని పురుష ఉద్యోగుల నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో బదిలీల లొల్లి మొదలైంది. గత ఏడాది సాధారణ బదిలీల సమయంలోనే అర్హత ఉన్న పలువురు బోధన, బోధనేతర సిబ్బందిని బదిలీ చేయగా.. తాజాగా బాలికల విద్యా సంస్థల నిబంధనలకు లోబడి గురుకుల సొసైటీ అధికారులు మరోమారు బదిలీలకు సిద్ధమయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 1274 ఉత్తర్వులను అనుసరించి బాలికల విద్యాసంస్థల్లో పూర్తి స్థాయిలో మహిళా అధికారులు, మహిళా ఉద్యోగులే ఉండాలని నిర్ణయించిన సొసైటీ అధికారులు, ఈ నిబంధనను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు జనరల్ విద్యా సంస్థలు, బాలికల విద్యా సంస్థలకు ప్రత్యేక రోస్టర్‌ను అనుసరిస్తున్నారు.
ఇప్పటికే బాలికల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న పురుష ఉద్యోగులను గుర్తించిన సొసైటీ అధికారులు.. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండటంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి జనరల్ పాఠశాలల్లో పని చేసే విధంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు.
ఖాళీలున్నచోట పోస్టింగ్
ప్రస్తుతం ఎస్సీ బాలికల విద్యా సంస్థల్లో దాదాపు 500 పైబడి బోధన, బోధనేతర పురుష సిబ్బంది ఉన్నట్లు అంచనా. వీరికి జనరల్ విద్యా సంస్థల్లో ఖాళీలకు అనుగుణంగా పోస్టింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీ కార్యదర్శి జోనల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జోనల్ అధికారులు పలువురు జూనియర్ లెక్చరర్లు, పోసు్ట్రగాడ్యుయేట్ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
అయితే ఈ ఏకపక్ష బదిలీలపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. గతేడాది సాధారణ బదిలీల్లో స్థానచలనం కలిగిన వారిని ప్రస్తుతం ఏకపక్షంగా బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. జీఓ 1274 నిబంధనలను గత సాధారణ బదిలీల సమయంలోనే అమలు చేస్తే సరిపోయేదని, ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో ఖాళీలు లేకుండా పోయాయని ఉద్యోగులు మండిపడుతున్నారు.
కోరుకున్న చోట బదిలీ అయ్యేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉండగా, అధికారులు వారికి నచ్చిన చోట ఏకపక్షంగా పోస్టింగ్ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. ఈ అంశంపై పలువురు ఉద్యోగులు న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు.