ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి షాకింగ్‌ న్యూస్‌.. ఇక ఇంటికొస్తారు!

Traffic Police Planning To Go Home Who Violate Traffic Rules - Sakshi

తీవ్రమైన ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి

వాహనం నంబర్‌ ఆధారంగా ఇంటికే

ప్రత్యేక బృందం ఏర్పాటుకు సన్నాహాలు

ప్రమాదాలు నిరోధించడానికే: ట్రాఫిక్‌ చీఫ్‌

‘ఖెరతాబాద్‌ చౌరస్తాలో సిగ్నల్‌ జంపింగ్‌ చేసిన ఓ యువకుడు అదే జోష్‌లో రాయదుర్గంలోని తన ఇంటికి చేరుకున్నాడు. మర్నాటి మధ్యాహ్నం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అతడి ఇంటికి వచ్చారు. కౌన్సిలింగ్‌ చేయడంతో పాటు అతడి వాహనంపై ఉన్న పెండింగ్‌ చలాన్లు కట్టించారు’.

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ స్థితిగతులను మెరుగుపరచడం, రోడ్డు ప్రమాదాలను నిరోధించడం దృష్టి పెట్టిన ట్రాఫిక్‌ విభాగం అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని చౌరస్తాలు, జంక్షన్లలో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే వారికి చెక్‌ చెప్పే విషయంలో వినూత్నంగా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగా ఆ తరహా ఉల్లంఘనుల ఇంటికి పంపడానికి ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేస్తున్నామని సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

ప్రమాదాలు మూడు తరహాలు... 
ట్రాఫిక్‌ విభాగం అధికారులతో పాటు రహదారి భద్రత నిపుణులు సైతం రోడ్డు ప్రమాదాలను మూడు తరహాలకు చెందినవిగా చెబుతుంటారు. వాహనం నడిపే వ్యక్తి మాత్రమే ప్రమాదకరంగా పరిగణించేవి మొదటి రకమైతే.. ఎదుటి వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నవి రెండో తరహాకు చెందినవి. ఈ రెంటికీ మించి వాహన చోదకుడితో పాటు ఎదుటి వారికీ ప్రమాదం జరగడానికి కారణమయ్యే వాటిని మూడో కేటగిరీగా పరిగణిస్తారు. సాధారణంగా ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఈ మూడో కోవకు చెందిన వాటికే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ నిరోధానికి చర్యలు తీసుకుంటూ ఉంటారు.  

కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షణ.. 
నగరంలోని కొన్ని జంక్షన్లలో ఉల్లంఘనలకు పాల్పతుడున్న వారి వల్ల.. వారితో పాటు ఎదుటి వారికీ ఇబ్బందులు వస్తున్నాయి. ప్రధానంగా సిగ్నల్‌ జంపింగ్, ర్యాష్‌ డ్రైవింగ్, జిగ్‌జాగ్‌ డ్రైవింగ్‌ వంటి వైలేషన్స్‌ ఎక్కువ ఇబ్బందికరంగా ఉన్నట్లు గుర్తించారు. చౌరస్తాలు, జంక్షన్లలో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి, ఫొటో, వీడియోలు తీయడానికి బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో అదనపు సిబ్బందిని మోహరించనున్నారు. వీరు ఆ తరహా ఉల్లంఘనులను, వారి వాహనం నంబర్‌ ఆధారంగా చిరునామా గుర్తిస్తారు. వైలేషన్‌ చోటు చేసుకున్న మరుసటి రోజే ఉల్లంఘనుడి ఇంటికి వెళ్లడంతో పాటు కౌన్సెలింగ్‌ ఇస్తారు. అక్కడిక్కడే వెరిఫై చేయడం ద్వారా ఆ వాహనంపై ఉన్న చలాన్లు గుర్తించి కట్టిస్తారు.

జంక్షన్లలోనూ ప్రమాదాలు.. 
నగరంలో 2019– 21 మధ్య కాలంలో నగరంలో చోటుచేసుకున్న ప్రమాదాలను ట్రాఫిక్‌ విభాగం అధికారులు అధ్యయనం చేశారు. అవి జరిగిన సమయాలతో పాటు ప్రదేశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే సిటీలోని అనేక జంక్షన్లు, యూ టర్న్స్‌ వద్ద పెద్ద సంఖ్యలోనే ప్రమాదాలు జరిగినట్లు తేల్చారు. ద్విచక్ర వాహనచోదకులు జంక్షన్లలో చేస్తున్న ఉల్లంఘనల కారణంగానూ ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ వైలేషన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. 

రెండింటికీ సమ ప్రాధాన్యం  
నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నిరోధానికీ సమ ప్రాధాన్యమిస్తున్నాం. అందులో భాగంగానే జంక్షన్లలో ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి, వారి ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్‌ చేయడానికి ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేస్తున్నాం. వాహన చోదకుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడంతో పాటు వారిలో బాధ్యత పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. 
– ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top